ఆధార్ లింకింగ్ మస్ట్ : త్వరలో కొత్త చట్టం

ఢిల్లీ: మళ్లీ ఆధార్ అనుసంధానం మస్ట్ అంటోంది కేంద్ర ప్రభుత్వం. ఆధార్ లింకింగ్ లేకుంటే పని జరగదని చెబుతోంది. ఇందుకోసం కొత్త చట్టం తీసుకురానుంది. అయితే ఆందోళన చెందాల్సిన పని లేదు.. అన్నింటికి ఆధార్‌తో అనుసంధానం చేయాల్సిన అవసరం లేదు. కేవలం డ్రైవింగ్ లైసెన్స్‌తో మాత్రమే ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయనున్నారు. ఈ మేరకు చట్టం తీసుకొచ్చే దిశగా పని చేస్తున్నామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.
ఆధార్‌తో అడ్డంగా దొరికిపోతారు:
ఆధార్‌తో డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా అనుసంధానం చేసేలా చట్టం తీసుకొస్తామని మంత్రి చెప్పారు. రోడ్డు ప్రమాదాలకు కారణం అయ్యే వారి లైసెన్సులు రద్దు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రమాదానికి కారణం అయ్యే వారు మళ్లీ డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్‌లు సంపాదిస్తున్నారు. అదే ఆధార్‌తో అనుసంధానం చేస్తే వారు తప్పించుకోవడానికి వీలుండదని కేంద్రం మంత్రి చెప్పారు. బయోమెట్రిక్స్ ఆధారంగా వారు దొరికిపోతారని వివరించారు. ”పేరు మార్చుకోగలరు.. కానీ బయోమెట్రిక్స్ మార్చుకోలేరు. డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్‌కు అప్లయ్ చేస్తే.. ఆల్రెడీ వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందనే విషయం ఇట్టే తెలిసిపోతుంది” అని కేంద్రమంత్రి తెలిపారు.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది:
ఆధార్ మస్ట్ కాదని, అన్నింటికి అనుసంధానం చేయాల్సిన అవసరం లేదని ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత సమాచార ధ్రువీకరణ కోసం ప్రైవేట్ సంస్థలు ఆధార్‌ను వినియోగించుకోవడానికి వీలు కల్పించే ఆధార్ చట్టంలోని సెక్షన్ 57ను న్యాయస్థానం రద్దు చేసింది. మొబైల్ ఫోన్ నంబర్లకు, బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. దీంతో ఆధార్ లింకింగ్ ఆగిపోయింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్‌లకు అనుసంధానం తప్పనిసరి చేసే విధంగా కేంద్రం కొత్త చట్టం తీసుకురానుంది.