Congress : హర్యానాలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. జులానా బరిలో వినేశ్ ఫొగాట్

హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. 31 మందిలో 28మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం దక్కింది.

Congress : హర్యానాలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. జులానా బరిలో వినేశ్ ఫొగాట్

Vinesh Phogat

Haryana Congress Candidate List 2024 : హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాత్రి తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో తొలి విడతలో 31 సీట్లకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది. వినేశ్ ఫొగట్ తో పాటు టోక్యా ఒలంపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియాలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వారిలో వినేశ్ ఫొగట్ కు తొలి జాబితాలో టికెట్ దక్కింది. ఆమె జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. బజరంగ్ పునియాను ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ (ఏఐకేసీ) కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది.

Also Read : CM Revanth Reddy : తెలంగాణ పీసీసీ చీఫ్ బాధ్యతలపై సీఎం రేవంత్ ఎమోషనల్ పోస్ట్!

హర్యానాలో అక్టోబర్ 5వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు. కాంగ్రెస్ విడుదల చేసిన మొదటి జాబితాలో 31 మందిలో 28మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం దక్కింది. వారిలో దుష్యంత్ చౌతాలాకు చెందిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్ కరణ్ కు కూడా కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. తొలి జాబితాలో ఐదుగురు మహిళలకు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించింది. వీరిలో నారాయణగఢ్ నుంచి శైలీ చౌదరి, సధౌరా నుంచి రేణుబాలా, కలనౌర్ నుంచి శకుంతలా ఖటక్, ఝజ్జర్ నుంచి గీతా భుక్కల్, జులనా నుంచి వినేశ్ ఫోగట్ పోటీ చేయనున్నారు.

 

తొలి జాబితాలో జాట్ వర్గానికి తొమ్మిది సీట్లు దక్కగా.. ముస్లింలకు మూడు, గుర్జర్ వర్గానికి చెందిన ముగ్గురికి అవకాశం కల్పించారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన కుల్దీప్ శర్మ స్థానంలో ఫరీదాబాద్ ఎన్ఐటీ నుంచి నీరజ్ శర్మను అభ్యర్థిగా నియమించారు. యాదవ్ సామాజిక వర్గానికి చెందిన రావ్ దాన్ సింగ్ మహేంద్రగఢ్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడు చిరంజీరావు రేవారి నుంచి పోటీ చేయనున్నారు. షంషేర్ సింగ్ జోగి సిక్కు జాట్ గా అసంధ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అయితే, తొలి జాబితాలో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలా, లోక్ సభ ఎంపీ కుమారి సెల్జాలకు టికెట్లు ఇవ్వలేదు. అయితే, వారిద్దరూ పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయించలేదు.