75 శాతం ఉద్యోగాలు స్థానికులకే…ఆర్డినెన్స్ కు హర్యాణా కేబినెట్ ఆమోదం

ఇకపై హర్యాణాలోని ప్రైవేట్ సంస్థల్లో 75 శాతం ఉద్యోగాలు ఆ రాష్ట్రానికి చెందిన యువతకే దక్కుతాయి. దీనికి సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్‌కు సోమవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించినట్లు డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా తెలిపారు.
కాగా, దేశంలో ఇలాంటి ఆర్డినెన్స్ జారీ చేసిన రెండో రాష్ట్రంగా హర్యానా నిలిచింది. గత ఏడాది జూలైలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి ఉత్తర్వులను జారీ చేసింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల హర్యానాలోని పరిశ్రమలపై బాగా ప్రభావం చూపింది. ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 70 నుంచి 80 శాతం కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు.
మరోవైపు పరిశ్రమలను పునరుద్ధరించిన తర్వాత హర్యానాలో కార్మికుల కొరత బాగా ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ సంస్థల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులతో భర్తీ చేసేందుకు ఒక ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. హర్యానాలో బీజేపీతో కలిసి అధికారంలో ఉన్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ ఈ మేరకు నేరవేరింది.