Vinesh Phogat: హరియాణా ఎన్నికలు.. వినేశ్ ఫోగట్ జులనాలో గెలుస్తుందా.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే?

హరియాణా రాష్ట్రంలోని జులనా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వినేశ్ ఫోగట్ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు. పలు సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం..

Vinesh Phogat: హరియాణా ఎన్నికలు.. వినేశ్ ఫోగట్ జులనాలో గెలుస్తుందా.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే?

Vinesh Phogat

Updated On : October 6, 2024 / 7:22 AM IST

Haryana Exit Poll Results: హరియాణాలో ప్రశాంత వాతావరణంలో శనివారం పోలింగ్ జరిగింది. మొత్తం 90 నియోజకవర్గాల్లో 61శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ప్రక్రియ పూర్తికాగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. అన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీకే మద్దతు తెలిపాయి. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోబోతుందని అంచనా వేశాయి. గత రెండు దఫాలుగా హర్యానాలో బీజేపీ అధికారంలో కొనసాగుతూ వస్తోంది. గడిచిన ఐదేళ్లలో ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, తద్వారా కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చేందుకు ప్రజలు మొగ్గుచూపారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇదిలాఉంటే.. హర్యానా ఎన్నికల్లో అందరి దృష్టి రెజ్లర్ వినేశ్ ఫోగట్ పైనే ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన వినేశ్ ఫోగట్ గెలుపు అవకాశాలపై ఎగ్జిట్ పోల్స్ కీలక విషయాలను వెల్లడించాయి.

Also Read : ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు వచ్చేశాయ్.. ఆ రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలుస్తుందో తెలుసా?

హరియాణా రాష్ట్రంలోని జులనా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వినేశ్ ఫోగట్ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు. బీజేపీ అభ్యర్ధిగా యోగేష్ బైరాగి పోటీలో ఉన్నారు. కాగా.. జేజేపీ నుంచి అమర్జీత్ ధండా మరోసారి బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో ఈ స్థానంలో బీజేపీ అభ్యర్ధిని ఓడించి అమర్జీత్ విజయం సాధించాడు. కాంగ్రెస్ పార్టీ మూడోస్థానంకు పడిపోయింది. అయితే, ఈసారి వినేశ్ ఫోగట్ జులనా నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఈ నియోజకవర్గంపై పడింది. పోలింగ్ పూర్తికావడంతో ఫోగట్ గెలుస్తారా..? ఓడిపోతారా? ఎగ్జిట్ పోల్స్ ఏమని అంచనా వేశాయి.. అనే విషయాలను ప్రజలు ఆసక్తిగా తెలుసుకుంటున్నారు.

 

పలు సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం.. వినేశ్ ఫోగట్ కు కాంగ్రెస్ పార్టీ అంత తేలికైన నియోజకవర్గం నుంచి సీటు ఇవ్వలేదు. గతంలో జులనా నియోజకవర్గంలో కాంగ్రెస్ మూడో స్థానంకు పరిమితం అయింది. కేవలం 12శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. గతంలో జేజేపీ విజయం సాధించగా.. మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేనే బరిలో నిలిచాడు. అయితే, ఈసారి జేజేపీ అభ్యర్ధికి గెలుపు అవకాశాలు తక్కువేనని సర్వే సంస్థలు అంచనా వేశాయి. పదేళ్లు బీజేపీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీపైనా స్థానికంగా వ్యతిరేఖత ఉందని పేర్కొన్నాయి. దీనికితోడు కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఆదరణ పెరగడం.. వినేశ్ ఫోగట్ కు గతంలో ఎదురైన పరిస్థితుల దృష్ట్యా ఆమెపై సానుభూతి ఉండటంతో ఈసారి జులనా నియోజకవర్గం నుంచి ఆమె విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి. అయితే, ఫోగట్ విజయం సాధిస్తారా.. ఓటమి చెందుతారా.. అనే విషయంపై పూర్తిస్పష్టత రావాలంటే ఈనెల 8వ తేదీన వెల్లడయ్యే ఫలితాల వరకు వేచి ఉండాల్సిందే.

 

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై వినేశ్ ఫోగట్ స్పందించారు. ఆమె పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఇది హర్యానా ప్రజలకు సంతోషకరమైన క్షణం. గత పదేళ్లలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్భుతమైన పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని వినేశ్ ఫోగట్ అన్నారు.