ఈ కమ్యూనిటీలోని ప్రతి జంట నలుగురు పిల్లల్ని కనాలి.. రూ.లక్ష చొప్పున ఇస్తాం: మధ్యప్రదేశ్ బ్రాహ్మిన్ బోర్డ్ చీఫ్
సనాతన ధర్మాన్ని రక్షించడానికి దంపతులు అధిక సంఖ్యలో పిల్లలను కనడం చాలా ముఖ్యమని అన్నారు.

Pandit Vishnu Rajoria,
బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన వారికి మధ్యప్రదేశ్ పరశురామ్ కల్యాణ్ బోర్డు చీఫ్, పండిట్ విష్ణు రాజోరియా ఓ ఆఫర్ ప్రకటించారు. నలుగురు పిల్లలను కనే ప్రతి జంటలకు రూ.లక్ష చొప్పున నజరానా ఇస్తామని తెలిపారు. విష్ణు రాజోరియాకు రాష్ట్ర క్యాబినెట్ హోదా కూడా ఉంది.
ఇండోర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విష్ణు రాజోరియా మాట్లాడుతూ… సనాతన ధర్మాన్ని రక్షించడానికి బ్రాహ్మణ దంపతులు నలుగురు పిల్లలను కనడం చాలా ముఖ్యమని చెప్పారు. నలుగురు పిల్లలను కనే జంటకు రూ.లక్ష బహుమతి ఇస్తానని తాను వ్యక్తిగతంగా ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు.
బ్రాహ్మణ దంపతులు తమ పిల్లల పెంపక బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారని విష్ణు రాజోరియా చెప్పారు. బ్రాహ్మణ జంటలు నలుగురు పిల్లలను కనడం తప్పనిసరని చెప్పుకొచ్చారు.
వారిలో ఒకరు కుటుంబాన్ని చూసుకోవచ్చని, మరొకరు కుటుంబం కోసం సంపాదించవచ్చని విష్ణు చెప్పారు. దీని ద్వారా మోక్ష ధర్మం కోసం కృషి చేయవచ్చని అన్నారు. భారత్ దినదినాభివృద్ధి చెందుతోందని ఆయన చెప్పారు. దేశంలో వనరులకు కొరత లేదని చెప్పుకొచ్చారు.
అంతేగాక, ఇప్పుడు బలమైన ప్రభుత్వం ఉందని, ఆ సర్కారు దేశ అభ్యున్నతి కోసం పని చేస్తోందని విష్ణు చెప్పారు. దీనికి సంబంధించినంత వరకు పేదరికం, ద్రవ్యోల్బణం గురించి మనం మాట్లాడకూడదని హితవు పలికారు. ఇటీవల 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. బలమైన దేశాన్ని నిర్మిస్తున్నామని, అందుకే సనాతన ధర్మాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన తెలిపారు.
దీంతో నలుగురు పిల్లలను కంటే కుటుంబాలపై ఆర్థిక భారం పడుతుందని ఓ జర్నలిస్టు అడిగారు. దానికి విష్ణు రాజోరియా సమాధానం చెబుతూ.. భారతదేశం స్వాతంత్ర్యం సాధించక ముందు ప్రజలకు సరైన బట్టలు లేవని, అలాగే, ప్రజలు ఆహారం పొందడానికి తక్కువ సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. కానీ దేవుని దయ వల్ల ఇప్పుడు మనకు కేంద్రం, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉన్నాయని, పరిస్థితులు మారిపోయాయని తెలిపారు.
PM Modi : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటికి ప్రధాని మోదీ, చిరంజీవి.. ఘనంగా సంక్రాంతి వేడుకలు