భారత్‌లో కరోనా థర్డ్ స్టేజీకి వెళ్లిందా? ఢిల్లీ వెళ్లినవారికే ఎందుకు వైరస్ సోకుతుంది?

  • Published By: sreehari ,Published On : March 31, 2020 / 11:56 AM IST
భారత్‌లో కరోనా థర్డ్ స్టేజీకి వెళ్లిందా? ఢిల్లీ వెళ్లినవారికే ఎందుకు వైరస్ సోకుతుంది?

Updated On : March 31, 2020 / 11:56 AM IST

దేశ రాజధానిలో నిజాముద్దీన్ అలజడితో దేశంలో మరణాల సంఖ్య, పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి నుంచి పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఉందా? లాక్ డౌన్ పాటించినా ఫలితం లేకుండాపోతుందా..? ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా స్టేజ్‌ కమ్యూనిటీ లెవెల్‌కి వెళ్లిపోతే.. అన్న అనుమానాలు గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. ఢిల్లీ సభకు వెళ్లిన వాళ్లంతా స్వచ్ఛందంగా డాక్టర్లను సంప్రదిస్తేనే పరిస్థితి అదుపులోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఆ దిశగా అడుగులు పడతాయా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. 

మర్కజ్ భవన్‌లో వందలాది మంది గుర్తింపు :
ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు.. వెయ్యి మందికి పైగా వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. ఇంకా చాలామంది మర్కజ్ భవనంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారిలో చాలా మందికి కరోనా అనుమానిత లక్షణాలు బయటపడ్డాయి. ఆస్పత్రికి తరలించిన వారిలో పలువురికి ఇప్పటికే కరోనా పాజిటివ్‌
నిర్ధారణ అయింది.

లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత కూడా నిజాముద్దీన్‌లోని మర్కజ్‌ భవనంలోనే 1,200 మందికి పైగా ఉండిపోయారు. పాజిటివ్‌ కేసులు బయటపడడంతో.. వీరందర్నీ ఐసోలేషన్‌కు తరలించారు. అటు.. మర్కజ్‌ భవనంతో పాటు పరిసర ప్రాంతాల్లో శానిటైజేషన్ చర్యలు చేపట్టారు. మతపరమైన సదస్సు నిర్వహించి జమాత్‌ నిర్వాహకులు ఘోరమైన తప్పిదం చేశారన్నారు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్. నిర్వాహకులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎల్జీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. 

తెలుగురాష్ట్రాల నుంచి వెయ్యికి పైగా హాజరు :
కరోనా విలయతాండవం చేస్తున్న వేళ వేలాదిమంది ఒక్కచోట గుమిగూడారు. కనీస సృహ లేకుండా, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటెన్ చేయకుండా రోజుల తరబడి ప్రార్థనలు చేశారు. ఇంతమందిలో ఏ ఒక్కరికి కరోనా సోకితే..? అన్న సోయి లేకుండా వ్యవహరించారు. సిట్యువేషన్ చూస్తుంటే సదస్సుకి హాజరైన వాళ్లందరికి కరోనా సోకిందనే
అనుమానాలు ఉన్నాయి. జమాత్ సభకు ఏపీ, తెలంగాణ నుంచి దాదాపు వెయ్యి మందికి పైగా… తమిళనాడు నుంచి 850 మంది హాజరైనట్టు తెలుస్తోంది. నిజానికి ఈ రాష్ట్రాల్లో మొదటినుంచి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 

బాధితులంతా ఇప్పటికే చాలామందిని కాంటాక్ట్ అయ్యారు. తెలంగాణ నుంచి ఇలా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో సోమవారం నాటికే ఆరుగురు మృతి చెందడం ఆందోళన పెంచుతోంది. దీంతో.. అప్రమత్తమైన అధికారులు… ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి  కాల్‌, జర్నీ డేటా మొత్తాన్ని సేకరిస్తున్నారు. వివరాలు పూర్తిగా తెలియాలంటే వారం, పది రోజుల సమయం పట్టే అవకాశముంది. ఈలోగా ఇంకా ఎంత మంది వైరస్ బారిన పడతారోనన్న టెన్షన్ మొదలైంది. మరోవైపు పరిస్థితి కమ్యూనిటీ లెవెల్‌కి వెళ్లిపోతుందా అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. 

SARS కంటే వేగంగా Covid-19 :
తెలుగురాష్ట్రాల నుంచి నిజాముద్దీన్‌ సదస్సుకి రెండువేల మందికి పైగానే వెళ్లినట్టు తెలుస్తోంది. మరణించిన వారిలోనే కాకుండా బాధితుల్లోనూ అక్కడినుంచి వచ్చిన వాళ్లే ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిజాముద్దీన్‌కు వెళ్లిన వాళ్లంతా ఇప్పటికే వందలాది మందిని కలిసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు వారిని
గుర్తించే పనిలో పడ్డారు. ఇది కొంత అసాధ్యమే అయినప్పటికీ.. అక్కడికి వెళ్లిన వాళ్లంతా స్వచ్చందంగా హోం క్వారంటైన్ లేదంటే ఆస్పత్రులకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. 

వర్కవుట్ అయితే ఫర్వాలేదు లేదంటే కరోనా సృష్టించే విలయతాండవం అంతా ఇంతా కాదు. వైరస్ స్టేజ్ కమ్యూనిటీ లెవెల్‌కి వెళ్లిపోతే మరణాల సంఖ్య ఊహించలేం. SARSతో పోలిస్తే కరోనా మొత్తం విభిన్నమని చెప్పాలి. SARS త్వరగా ప్రాణాలు తీస్తే.. కరోనా మాత్రం వేగంగా విస్తరిస్తుంది. మరణాల రేటు తక్కువగానే ఉన్నా.. అది సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు.

అందుకే కరోనా ప్రాణాంతక వ్యాధి కాకపోయినా తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ముందు జాగ్రత్తలతో వైరస్‌ను తరిమికొట్టే అవకాశాలు మన చేతుల్లోనే ఉన్నాయి. నిజాముద్దీన్ అలజడి నుంచి ఎంత త్వరగా కోలుకుంటే అంత మేలు. లేదంటే ముప్పు ముంచేసినట్టేనంటున్నారు వైద్య నిపుణులు.