చిదంబరం గదిని శుభ్రంగా ఉంచండి..మినరల్ వాటర్ ఇవ్వండి – ఢిల్లీ హైకోర్టు

తన ఆరోగ్యం బాగా లేదని..బెయిల్ మంజూరు చేయాలని కోరిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం మాటలను ఢిల్లీ హైకోర్టు వినిపించుకోలేదు. ఆయన దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను 2019, నవంబర్ 01వ తేదీ శుక్రవారం కొట్టివేసింది. చిదంబరం ఆరోగ్యం సరిగ్గానే ఉందంటూ ఢిల్లీ హైకోర్టుకు ఎయిమ్స్ మెడికల్ బోర్డు నివేదిక ఇవ్వడంతో పై విధంగా స్పందించింది. ఆస్పత్రిలో చికిత్స అందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. చిదంబరం ఉంటున్న గదిని శుభ్రంగా ఉంచి..మినరల్ వాటర్ సౌకర్యం కల్పించాలని తీహార్ జైలు సూపరింటెండెంట్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నివేదిక ఆధారంగా చిదంబరానికి సురక్షిత పరిసరాలు ఉండేలా చూడడంతో పాటు..దోమల నుంచి రక్షణ కల్పించాలని కూడా సూచించింది.
ఐఎన్ఎక్స్ మీడియాపై సీబీఐ కేసులో చిదంబరానికి బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఈడీ విచారణనను ఎదుర్కొంటున్నారు. క్రోన్ వ్యాధితో బాధపడుతున్న చిదంబరం ఆరోగ్య పరిస్థితిపై నివేదికను సమర్పించేందుకు ఓ మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాల్సిందిగా ఎయిమ్స్ మెడికల్ బోర్డును ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కాగా..ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని..పరిశుభ్ర వాతావరణంలో ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ చిదంబరం మధ్యంతర బెయిల్ దాఖలు చేశారు.
ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో చిదంబరాన్ని సీబీఐ ఆగస్టు 21న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 74ఏళ్ల సీనియర్ కాంగ్రెస్ నేతను ఈడీ కస్టడీకి అనుమతి ఇస్తూ అక్టోబర్ 24న కోర్టు ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం చిదంబరం ఈడీ కస్టడీలో ఉన్నారు.
Read More : మోగిన ఎన్నికల నగారా: జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల