Hemant Soren : జార్ఖండ్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. నాల్గోసారి సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం..!

Hemant Soren : జార్ఖండ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. రాంచీలోని మోరబాది గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు.

Hemant Soren : జార్ఖండ్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. నాల్గోసారి సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం..!

Jharkhand Chief Minister

Updated On : November 28, 2024 / 8:11 PM IST

Hemant Soren : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) భారీ విజయం సాధించింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు జార్ఖండ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. రాంచీలోని మోరబాది గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సంతోష్ గంగ్వార్ హేమంత్ సోరెన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. హేమంత్ నాలుగోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రి అయ్యారు. సీఎంతో పాటు 6 నుంచి 8 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారనే చర్చ జరిగినా అది జరగలేదు.

సోరెన్ ప్రమాణస్వీకారోత్సవానికి ఇండియా కూటమి నేతలు :

రాంచీలోని మోరబాది మైదాన్‌లో సీఎంతో పాటు మంత్రులెవరూ ప్రమాణం చేయలేదు. హేమంత్ ప్రమాణ స్వీకారానికి ఆయన తండ్రి, మూడుసార్లు మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ కూడా హాజరయ్యారు. హేమంత్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా ఇండియా కూటమి నేతలు కూడా హజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలతో పొత్తు పెట్టుకుని జేఎంఎం పోటీ చేయడం గమనార్హం. జేఎంఎం నేతృత్వంలోని కూటమి 56 సీట్లు గెలుచుకుంది. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 81 కాగా, మెజారిటీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 41 మంది ఎమ్మెల్యేలు. మెజారిటీకి అవసరమైన సంఖ్య కన్నా 15 ఎక్కువ. ఒక్క జేఎంఎంకు 34 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ 16, రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జేడీ) 4, లెఫ్ట్‌ 2 సీట్లు గెలుచుకున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే హేమంత్ సోరెన్ గవర్నర్ సంతోష్ గంగ్వార్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యమంత్రి పదవి విషయంలో ఎలాంటి ఉత్కంఠ లేదు. కానీ, మంత్రివర్గం కూర్పుపై కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. హేమంత్ సోరెన్ ఒంటరిగా పదవీ ప్రమాణం చేయడానికి కారణం ఇదే. సీఎంతో పాటు జేఎంఎం కోటాలో ఏ ఎమ్మెల్యే కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేయలేదు. నలుగురికి ఒకటి అనే ఫార్ములాతో కాంగ్రెస్ 4 మంత్రి పదవులు డిమాండ్ చేస్తోందని సమాచారం. హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వంలో కేవలం నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు మాత్రమే మంత్రి పదవులు దక్కాయి.

రాజకీయ ప్రస్థానం ఇలా మొదలైంది : 
49 ఏళ్ల హేమంత్ సోరెన్.. మొదటి రాజ్యసభ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 2002లో జేఎంఎం స్టూడెంట్ వింగ్‌లో చేరారు. 2005లో దుమ్కా నుంచి స్వతంత్ర అభ్యర్థి స్టీఫెన్ మరాండి చేతిలో ఓటమి పాలయ్యారు. 2009లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2010 నుంచి 2013 వరకు బీజేపీ-జేఎంఎం కూటమి ప్రభుత్వంలో అర్జున్ ముండా జార్ఖండ్ సీఎంగా ఉండగా.. హేమంత్ సోరెన్ డిప్యూటీ సీఎంగా పనిచేశారు.

2013లో కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీల సపోర్టుతో జేఎంఎం జార్ఖండ్‌లో అధికారాన్ని దక్కించుకుంది. అప్పుడే తొలిసారిగా హేమంత్ సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014లో జార్ఖండ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర అసెంబ్లీలో హేమంత్ సోరెన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2019లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి విజయంతో మళ్లీ సీఎంగా హేమంత్ సోరెన్ పగ్గాలు అందుకున్నారు.

2024లో భూ కుంభకోణం, మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సీఎం హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేసింది. దాంతో ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం జైలుకు వెళ్లారు. సోరెన్ స్థానంలో జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ బాధ్యతలు చేపట్టారు.

బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన హేమంత్ సోరెన్.. మూడోసారి సీఎంగా ప్రమాణం చేశారు. దాంతో చంపై సోరెన్ జేఎంఎంకు గుడ్‌బై చెప్పేసి వీడి బీజేపీలో చేరిపోయారు. హేమంత్ సోరెన్ అరెస్ట్‌తో ఆయన భార్య కల్పనా సోరెన్ రాజకీయాల్లోకి అడుగుటపెట్టారు. ఇటీవల ఎన్నికల్లో కల్పనా సోరెన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Read Also : RGV Arrest : అందుకే అన్ని పిటిషన్‌లు :హైకోర్టు అడ్వకేట్ రామారావు