హై అలర్ట్ : రాష్ట్రంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారు

  • Published By: Mahesh ,Published On : August 21, 2019 / 02:35 PM IST
హై అలర్ట్ : రాష్ట్రంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారు

Updated On : August 21, 2019 / 2:35 PM IST

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. టెర్రరిస్టులు చొరబడ్డారు అనే సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో పోలీసులు హై అలర్ట్‌ అనౌన్స్ చేశారు. ఆఫ్గనిస్థాన్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు రాష్ట్రంలోకి చొరబడ్డారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గుజరాత్‌, రాజస్థాన్‌ సరిహద్దు పంచుకునే జిల్లాల్లో టెర్రరిస్టులు దాక్కొని ఉండొచ్చని భావిస్తున్నారు. జాబువా, అలీరాజ్‌పూర్‌, ధార్‌, బార్వాణీ, రత్లామ్‌, మంద్‌సౌర్‌, నీముచ్‌, అగర్‌-మాల్వా జిల్లాల్లో తీవ్రవాదుల కోసం తీవ్ర స్థాయిలో గాలింపు జరుగుతోందని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు రాష్ట్రంలోకి ఎలా చొరబడ్డారు అనేది తెలియాల్సి ఉంది.

ఆఫ్గనిస్థాన్‌లోని కునార్‌ ప్రావిన్స్‌కు చెందిన ఓ ఉగ్రవాదికి సంబంధించిన స్కెచ్ ని పోలీసులు విడుదల చేశారు. ఆ టెర్రరిస్టు వివరాలను అన్ని పోలీస్‌ స్టేషన్లు, చెక్‌ పాయింట్లకు పంపారు. రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి మధ్యప్రదేశ్‌కు వచ్చే రైళ్లలో సైతం సోదాలు జరుగుతున్నాయని అన్నారు. 2014 బుర్ద్వాన్‌ పేలుళ్ల కేసులో నిందితుడైన జహీరుల్‌ షేక్‌(31) అనే ఉగ్రవాదిని గతవారం మధ్యప్రదేశ్‌లో అరెస్టు చేశారు. ఇండోర్‌లోని ఆజాద్‌ నగర్‌ ప్రాంతంలో జహీరుల్‌ షేక్‌ ఎన్‌ఐఏకు పట్టుబడ్డాడు.

రాష్ట్రంలోకి టెర్రరిస్టులు చొరబడ్డారనే వార్తలు స్థానికులను భయాందోళనకు గురి చేశాయి. ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలను కోరారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భద్రతను కట్టుదిట్టం చేశామని, నిఘా పెంచామని వెల్లడించారు.