బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ర్యాలీకి కోర్టు అనుమతి

కట్టుదిట్టమైన షరతులతో ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ ఎమ్మెల్యేకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ర్యాలీకి కోర్టు అనుమతి

MLA Raja Singh

MLA Raja Singh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ర్యాలీకి బాంబే హైకోర్టు అనుమతి ఇచ్చింది. ముంబైకి సమీపంలో మీరా రోడ్‌లో ఊరేగింపు కార్యక్రమం ఉండనుంది. ఫిబ్రవరి 25 సాయంత్రం 5 గంటలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా రాజా సింగ్ శోభా యాత్ర చేపట్టనున్నారు. కట్టుదిట్టమైన షరతులతో ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ ఎమ్మెల్యేకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది.

రాజాసింగ్ ర్యాలీ, శోభా యాత్ర వీడియోలను రికార్డ్ చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదంటూ రాజాసింగ్‌కు షరతు విధించింది. జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు జనవరి 21వ తేదీ రాత్రి మీరా రోడ్డులోని నయానగర్‌లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ శోభా యాత్ర కూడా మీరా రోడ్‌లోని నయానగర్‌లో తలపెట్టిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.

కొద్దిరోజుల క్రితం ఎంఐఎం నేత వరీష్ పఠాన్ నయా నగర్ వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ముంబైలోని దహిసర్ బోర్డర్‌లో అదుపులోకి తీసుకుని నయా నగర్‌కు రావద్దంటూ నోటీసులు ఇచ్చారు. రాజా సింగ్ ర్యాలీకి కూడా అనుమతి ఇవ్వకపోవడంతో హిందూ సంస్థ కోర్టును ఆశ్రయించింది. కోర్టు నుండి అనుమతి పొందాక రాజాసింగ్ ర్యాలీ, శోభాయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు.