ఢిల్లీ అసెంబ్లీలో హైడ్రామా…అగ్రి చట్టాల కాపీలు చించేసిన కేజ్రీవాల్

ఢిల్లీ అసెంబ్లీలో హైడ్రామా…అగ్రి చట్టాల కాపీలు చించేసిన కేజ్రీవాల్

Updated On : December 17, 2020 / 8:18 PM IST

High drama in Delhi Assembly 22 రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో అన్నదాతల ఆందోళనలకు కారణమైన నూతన వ్యవసాయ చట్టాల కాపీలను ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు చించివేయడంతో ఇవాళ(డిసెంబర్-17,2020)ఢిల్లీ అసెంబ్లీలో హైడ్రామా చోటుచేసుకుంది.

ఒక్కరోజు సెషన్ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమైన వెంటనే ఆప్ ఎమ్మెల్యేలు నరేంద్ర గోయల్,సోమ్ నాథ్ భారతిలు నూతన అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీలో నూతన అగ్రి చట్టాల కాపీలను చింపివేశారు.రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఈ నల్ల చట్టాలను నేను వ్యతిరేకిస్తున్నా అంటూ చట్టాల కాపీలను చింపివేస్తున్న సమయంలో గోయల్ తెలిపారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా అగ్రి చట్టాల కాపీలను చించేశారు. కేంద్రప్రభుత్వం వెంటనే ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని విజ్ణప్తి చేశారు. గడిచిన 20 రోజుల్లో 20మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. దేశ రాజధాని సరిహద్దుల్లో జరుగుతున్న ఆందోళనల్లో సగటున రోజుకి ఒక రైతు ప్రాణం కోల్పోతున్నాడని అన్నారు. తమ వాయిస్ వినిపించేలా చేసేందుకు రైతులు ఇంకెన్ని త్యాగాలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తాను ప్రశ్నిస్తున్నానని కేజ్రీవాల్ తెలిపారు. కేంద్ర పాలకులు బ్రిటీష్ వాళ్లకన్నా హీనం కారాదని అన్నారు.

కాగా,నవంబర్-23న ఈ మూడు వివాదాస్పద చట్టాలను కేజ్రీవాల్ ప్రభుత్వం నోటిఫై(గుర్తించడం) చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, ఈ చట్టాలను రైతులకు వ్యతిరేకమైన చట్టాలగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇది తీవ్రమైన ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని అన్నారు. కొద్ది మంది పెట్టుబడిదారులకు మాత్రమే ఈ చట్టాలు ప్రయోజనకరంగా ఉంటాయని పేర్కొన్నారు.

అయితే,వ్యవసాయరంగంలో విప్లవాత్మక సంస్కరణలు అంటూ ఈ ఏడాది సెప్టెంబర్ లో మూడు బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టగా..ఈ బిల్లులపై పెద్ద చర్చ జరగకుండానే పార్లమెంట్ వీటికి ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ చట్టాల వల్ల రైతులకు దేశంలో ఎక్కడైనా పంట అమ్ముకునే స్వేచ్ఛ లభిస్తుందని,దళారీలు,మధ్యవర్తులకు మాత్రమే ఈ చట్టాల వల్ల ఇబ్బంది కలుగుతదని కేంద్రం చెబుతోంది.

అయితే, ఈ చట్టాల వల్ల తాము కార్పోరేట్ల గుప్పిట్లోకి వెళ్లిపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టాలను రద్దు చేయాలంటూ 22 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు ప్రభుత్వం రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపినప్పటికీ అవి సఫలం కాలేదు. చట్టాల్లో సవరణకు కేంద్రం ప్రతిపాదిస్తుండగా…సవరణలు వద్దు చట్టాల రద్దే కావాలని రైతులు పట్టుబట్టడంతో పలు మారు జరిగిన చర్చలు విఫలమయ్యాయి.