Farmers Chalo Delhi Protest : శంభు సరిహద్దుల్లో ఉద్రిక్తంగా మారిన రైతుల పాదయాత్ర..
కనీస మద్దతు ధర సహా పలు డిమాండ్లను నెరవేర్చాలని అన్నదాతలు ఆందోళన బాట పట్టారు.

Farmers Chalo Delhi Protest : పంటలకు కనీస మద్దతు ధర సహా 12 డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ శంభు సరిహద్దు వద్ద రైతులు చేపట్టిన ఢిల్లీ మార్చ్ ఉద్రిక్తంగా మారింది. పాదయాత్రను ప్రారంభించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, రైతులకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనలు తెలుపుతున్న రైతులను చెదరగొట్టడానికి హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ ను ఉపయోగించారు. 101 మంది రైతుల పేర్లు తమ దగ్గర ఉన్నాయని, వారికి మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఇస్తామని పోలీసులు తేల్చి చెబుతున్నారు.
ఆ రైతులు కాకుండా ఎక్కువమంది వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు. నిన్న చర్చలకు కేంద్రం ముందుకు రాకపోవడంతో ఇవాళ ఛలో ఢిల్లీ పాదయాత్రను రైతులు స్టార్ట్ చేశారు. శంభు సరిహద్దు నుంచి 101 మంది రైతుల బృందం పాదయాత్రగా బయలుదేరింది. కనీస మద్దతు ధర సహా పలు డిమాండ్లను నెరవేర్చాలని అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. ఇక 101 మంది రైతుల బృందం చేస్తున్న నిరసన కార్యక్రమం ఇవాళ్టితో 300 రోజులకు చేరుకుంది.
101 మంది రైతుల బృందం ఢిల్లీ వైపు కవాతు చేయడం ప్రారంభించింది. వారిలో చాలామంది మాస్క్‌లు, గాగుల్స్, టియర్ గ్యాస్ షెల్లింగ్ సమయంలో ఉపయోగపడే ఇతర రక్షణ సామగ్రిని కలిగి ఉన్నారు. ఈ నిరసనకు రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా మద్దతు ఇచ్చాయి.
కొంతమంది నిరసనకారుల గుర్తింపుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ధృవీకరణ తర్వాత మాత్రమే వారిని కొనసాగించడానికి అనుమతిస్తామని తేల్చి చెప్పారు. “మా దగ్గర 101 మంది రైతుల పేర్ల జాబితా ఉంది. కానీ, గుంపులో వేరే వ్యక్తులు ఉన్నారు. వారు మమ్మల్ని గుర్తించనివ్వడం లేదు. వారు గుంపుగా ముందుకు సాగుతున్నారు” అని హర్యానా పోలీసు అధికారి తెలిపారు.
అయితే పోలీసుల వద్ద తప్పుడు పేర్ల జాబితా ఉందని ఒక రైతు తెలిపారు. “వారి జాబితాలో ఇక్కడికి వచ్చే రైతుల పేర్లు లేవు. మమ్మల్ని ముందుకు వెళ్లనివ్వమని మేము పోలీసులను కోరాము. మా గుర్తింపు కార్డులను వారికి చూపుతాము. కానీ పోలీసులు మాత్రం మాకు అనుమతి లేదని చెబుతున్నారు” అని రైతు ఆరోపించారు.
Also Read : అంతరిక్షంలో అణుబాంబు..! ప్రపంచ దేశాలను వణికిస్తున్న కాస్మోస్ 2553.. ఏంటీ కాస్మోస్? అంత డేంజరా?