అయోధ్యలో రామ మందిరం ఆకృతి.. 2024లోగా నిర్మాణం పూర్తి!

అయోధ్య విషయంలో చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు. రాజకీయ పార్టీ నాయకుల నుంచి గానీ, ముస్లిం మత పెద్దల నుంచి గానీ పెద్దగా సుప్రీం తీర్పు పట్ల నెగెటివ్ రియాక్షన్ రాలేదు. దీంతో రివ్యూ పిటిషన్ వేస్తామన్న సున్నీ వక్ఫ్ బోర్డు సైతం ఆ నిర్ణయం నుంచి తప్పుకున్నట్లే. ఇంకేముంది? అయోధ్యలో రాముడి గుడి నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలిగిపోయినట్లే లెక్క.
దీంతో రామాలయ నిర్మాణ ట్రస్ట్ ఏర్పాటు కాబోతుంది. గతంలో రామజన్మభూమి న్యాస్ రూపొందించిన డిజైన్ ప్రకారమే భవ్యమందిరాన్ని నిర్మించాలని ఆశిస్తుంది విశ్వహిందూ పరిషత్. ఈ మేరకు వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు విష్ణు సదాశివ్ కోక్జే కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయోధ్య వివాదంపై తీర్పును స్వాగతిస్తున్నట్లు వెల్లడించిన ఆయన ఈ అంశంలో ఎవరూ విజేతలు కాదని, పరాజితులు లేరని, శతాబ్దాలుగా నలుగుతున్న అంశంపై సుప్రీంకోర్టు స్పష్టత మాత్రమే ఇచ్చిందని, తీర్పు అందరికీ ఆమోద యోగ్యం అయినదని చెప్పింది.
ఇదే సమయంలో రామాలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు రామజన్మభూమి న్యాస్ అనేక పనులు పూర్తి చేసిందని, డిజైన్ రూపొందించడం, శిల్పాలు, స్తంభాలు చెక్కించడం సహా పలు పనులు న్యాస్ ఇప్పటికే పూర్తి చేసిందని ఆయన వెల్లడించారు. అందువల్ల న్యాస్ రూపొందించిన డిజైన్‌ను ట్రస్ట్ అమలు చేస్తే ఆలయ నిర్మాణం సులభతరం అవుతుందని వెల్లడించారు.
ఇప్పటికైతే ట్రస్ట్ తమ అభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటుందని అనుకోవట్లేదని అన్నారు. ట్రస్ట్‌లో రామభక్తులే ఉంటారని, అందువల్ల ఎలాంటి ఇబ్బంది ఉండవంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2024వరకు రామ మందిరం పూర్తవుతుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.