Waqf Land: దేశంలో వక్ఫ్ సంపద మొత్తం ఎంత.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఆస్తులున్నాయి..?
దేశవ్యాప్తంగా విస్తృత చర్చతోపాటు అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారితీసిన వక్ఫ్ (సవరణ) బిల్లు -2025 పార్లమెంట్, రాజ్యసభల్లో ఆమోదం పొందింది.

Waqf Board
Waqf Land: దేశవ్యాప్తంగా విస్తృత చర్చతోపాటు అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారితీసిన వక్ఫ్ (సవరణ) బిల్లు -2025 పార్లమెంట్, రాజ్యసభల్లో ఆమోదం పొందింది. వక్ఫ్ బిల్లును కేంద్రం ఇక రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి సంతకం అనంతరం బిల్లు చట్టంగా రూపుదాల్చనుంది. కొత్త బిల్లు ప్రకారం.. వరుసగా ఐదేళ్లే ఇస్లాంను ఆచరించి, ఆస్తిపై యాజమాన్య హక్కులు కలిగిన వ్యక్తి మాత్రమే ఆ ఆస్తిని దానం చేయగలరు. అలాగే కొత్త బిల్లులో సర్వే నిర్వహించే అధికారం వక్ఫ్ కమిషనర్ నుంచి కలెక్టర్ కు బదిలీ అయింది.
Also Read: WAQF Bill: రాజ్యసభలోనూ వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. చట్టంగా మారడానికి ఒక్క అడుగు దూరంలో..
వక్ఫ్ బోర్డు కింద ఎన్ని చరాస్తులు, స్థిరాస్తులు ఉన్నాయి..?
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. వక్ఫ్ బోర్డు కింద 8,72,328 స్థిరాస్తులు, 16,713 చరాస్తులు నమోదయ్యాయి. అలాగే వక్ఫ్ బోర్డు కింద 3,56,051 వక్ఫ్ ఎస్టేట్ లు కూడా నమోదయ్యాయి. వక్ఫ్ బోర్డు కింద దేశంలో 9.4లక్షల ఎకరాల భూమి ఉంది. వీటి విలువ రూ.1.2లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. అంటే.. భారతదేశంలో రక్షణ మంత్రిత్వ శాఖ, రైల్వే శాఖల తరువాత ఎక్కువ భూములు ఉంది వక్ఫ్ బోర్డుకే కావటం గమనార్హం. రక్షణ మంత్రిత్వ శాఖకు 17లక్షల95వేల ఎకరాల భూమి ఉండగా.. రైల్వే శాఖ వద్ద 12లక్షల ఎకరాల భూమి ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో వక్ఫ్ ఆస్తులెన్ని..?
మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లో దాదాపు 2,32,547 వక్ఫ్ ఆస్తులు ఉండగా.. పశ్చిమ బెంగాల్ లో దాదాపు 80,480, గుజరాత్ రాష్ట్రంలో 39,940 ఆస్తులు, బీహార్ రాష్ట్రంలో 8,616 ఆస్తులు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు పరిధిలో 45,682 ఆస్తులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14,685 ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలో 66,095, మహారాష్ట్రలో 36,701 ఆస్తులు కాగా.. మిగిలిన రాష్ట్రాల్లోనూ వక్ఫ్ బోర్డులు ఆస్తులున్నట్లు మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన డేటాలో పేర్కొంది.