ఆజాద్ పై మోడీ ప్రశంసలు..ప్రధానిపై ఖర్గే ఫైర్

ఆజాద్ పై మోడీ ప్రశంసలు..ప్రధానిపై ఖర్గే ఫైర్

Updated On : February 8, 2021 / 5:52 PM IST

Modi in Rajya Sabha రాజ్యసభలో ఇవాళ ప్రధాని ప్రసంగంపై కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే పెదవి విరిచారు. ప్రధాని ప్రసంగం అనంతరం మీడియాతో మాట్లాడిన ఖర్గే..మోడీ ప్రసంగంలో విషయం ఏమీ లేదని కొట్టిపారేశారు. రైతు చట్టాల్లో లోపించిన వాటిపై కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనలను ప్రధాని ఏమాత్రం ఖాతరు చేయలేదని విమర్శించారు. రైతులు, గ్రాడ్యుయేట్లు, సైంటిస్టుల ఆందోళనలను కూడా ప్రధాని పెడచెవిన పెట్టారని అన్నారు. మమ్మల్ని ఫూల్స్ అనుకుంటున్నారా? అంటూ పరోక్షంగా ప్రధానిపై ఖర్గే మండిపడ్డారు.

ఇక, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై ఇవాళ ప్రధాని మోదీ రాజ్యసభలో చేసిన ప్రసంగంలో.. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలపై తన స్టైల్ లో విమర్శలు గుప్పించారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులపై విపక్ష పార్టీలు తమ బరువు మోపుతున్నాయన్నారు. మన్మోహన్ జీ… సభలోనే ఉన్నారు. ఆయన అప్పట్లో ఏమన్నారో చదవి వినిపిస్తాను. సాగు చట్టాలకు వ్యతిరేకంగా యూ-టర్న్ తీసుకున్న వారు బహుశా ఆయన వ్యాఖ్యలతోనైనా ఏకీభవిస్తారేమో అని మోడీ పేర్కొన్నారు.

గతంలో మన్మోహన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోడీ ఉటంకించారు. 1930లో తీసుకొచ్చిన మార్కెంటింగ్ పాలన వల్ల పెద్ద పెద్ద మార్కెట్ వ్యవస్థలను తీసుకురావడానికి చాలా ఇబ్బందులున్నాయి. వాటిని తొలగించి, రైతులకు లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నాం అని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలనే తాను ఉటంకిస్తున్నానని ప్రధాని సభలో పేర్కొన్నారు. అప్పుడు నేతలంతా వ్యవసాయ సంస్కరణలకు అనుకూలంగా మాట్లాడిన వారేనని, ఇప్పుడు మాత్రం రాజకీయాల కోసం యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు.

ప్రసంగ సమయంలో అనూహ్యంగా ప్రధాని..రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేతగా ఉన్న గులాం నబీ ఆజాద్‌ను ప్రశంసించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆజాద్ తన సొంత రాష్ట్రమైన జమ్మూకశ్మీర్‌‌లో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలను మోడీ గుర్తు చేస్తూ… ఆజాద్ ఎప్పుడూ డీసెంట్‌గా మాట్లాడతారని.. ఎప్పుడూ అనుచిత భాష మాట్లాడరని అన్నారు. ఆయన నుంచి మనం ఇదే నేర్చుకోవాలని, ఆయనంటే తనకెంతో గౌరవమని అన్నారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వానికి ఆ పార్టీకి చెందిన 23 మంది నేతలు రాసిన లేఖను కూడా పరోక్షంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి గతంలో లేఖ రాసిన 23 మంది నేతలను జీ-23గా ప్రధాని పేర్కొంటూ..జీ-23 చేసిన సూచనలను కాంగ్రెస్ ఇదే స్ఫూర్తితో తీసుకుని, పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలుగా పరిగణించబోదని ఆశిస్తున్నానని అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు సభలో ఉన్న గులాం నబీ ఆజాద్ ముసిముసి నవ్వులు నవ్వారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని, పార్టీ వర్కింగ్ కమిటీని పునర్వవస్థీకరించాలని, అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగాలని 23 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ఇటీవల సోనియాగాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేతల్లో ఆజాద్ కూడా ఉన్నారు. ఈ లేఖ తొలుత పార్టీలో సంచలనం సృష్టించినప్పటికీ..సోనియా జోక్యంతో ఆ తర్వాత సద్దుమణిగింది.