బ్రిటన్ నుంచి భారత్ చేరిన 450 ఆక్సిజన్ సిలిండర్లు
కరోనాపై పోరులో భాగంగా భారత్‌కు సాయంగా తొలి విడతగా బ్రిటన్ పంపించిన 450 ఆక్సిజన్ సిలిండర్లు

Oxygen Cylinders From Uk Reaches India
Covid-19 కరోనాపై పోరులో భాగంగా భారత్‌కు సాయంగా తొలి విడతగా బ్రిటన్ పంపించిన 450 ఆక్సిజన్ సిలిండర్లు మంగళవారం ఉదయం చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి చేరాయి. భారత వాయుసేన విమానం వీటిని యూకే నుంచి తరలించింది. ఒక్కో సిలిండరులో 46.6 లీటర్ల ఆక్సిజన్ నిలువచేసే సామర్థ్యం ఉంది. చెన్నై ఎయిర్ పోర్ట్ కి మొదటి బ్యాచ్ సిలిండర్లు చేరుకున్న వెంటనే కేవలం 15నిమిషాల్లోనే అన్ని కస్టమ్ క్లియర్లెన్స్ లను పూర్తి చేసినట్లు చెన్నై కస్టమ్స్ అధికారులు తెలిపారు.
కరోనాని ఎదుర్కోవడంలో భాగస్వామిగా ఉండి భారత్‌కు సాయం అందించిన యూకేకు కృతజ్ఞతలు అని విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. కాగా, భారత్‌కు 5వేల ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తామని ప్రకటించిన బ్రిటిష్ ఆక్సిజన్ సంస్థ.. తొలి విడత కింద 900 సిలిండర్లను తరలించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో భారత్‌కు మంగళవారం 450 సిలిండర్లు చేరాయి. ఇక,అదనంగా మరో 1000 వెంటిలేటర్లను భారత్‌కు అందించేందుకు సిద్ధమని యూకే ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే.
మరోవైపు, వైద్య పరికరాలు అందించడం ద్వారా భారత్‌కు సాయం అందించనున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి గబీ అష్కెంజాయ్ స్పష్టం చేశారు. భారత్ ఇజ్రాయెల్‌కు ప్రధాన మిత్రదేశం. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత్‌కు అండగా ఉండేందుకు మేం సిద్ధం. ఈ క్రమంలో వారికి వైద్య పరికరాలు మొదలైనవి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. మంగళవారం నుంచి వారం రోజుల పాటు ఈ పనులు జరుగుతాయి అని అష్కెంజాయ్ తెలిపారు.