Anti-Drone System : జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ‘యాంటీ డ్రోన్’ సిస్టమ్
వరుస డ్రోన్ దాడుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లోని భద్రతా దళాలు మరింత అలర్ట్ అయ్యాయి.

|IAF Station In Jammu Gets Anti-Drone System: వరుస డ్రోన్ దాడుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లోని జాతీయ భద్రతా దళాలు(NSG)మరింత అలర్ట్ అయ్యాయి. శత్రు డ్రోన్లను ఎదుర్కొనేందుకు బుధవారం జమ్మూలోని వైమానిక స్థావరంలో డ్రోన్ కౌంటర్ వ్యవస్థ(Anti-Drone System)ఏర్పాటు చేశాయి భద్రతా బలగాలు. డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు భద్రతా వ్యవస్థలో మార్పులు చేస్తున్నట్లు చెప్పిన ఆధికార వర్గాలు.. జమ్ము వైమానిక స్థావరంలో రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్, జామర్లను అమర్చడం సహా డ్రోన్ విధ్వంసక తుపాకులను మోహరించినట్లు తెలిపాయి.
కాగా,గత ఆదివారం జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై డ్రోన్ దాడి జరిగిన విషయం తెలసిందే. ఆ తర్వాతి రోజు రత్నుచక్-కాలుచక్ మిలటరీ స్టేషన్ పై డ్రోన్ దాడికి యత్నించగా.. భారత బలగాలు తిప్పికొట్టాయి. బుధవారం కూడా జమ్ములోని మూడు ప్రాంతాల్లో(మిరాన్ సాహిబ్,కాలుచక్,కుంజ్వాని) డ్రోన్ల సంచారం కలకలం రేపింది. మొత్తంగా గడిచిన నాలుగు రోజుల్లో ఏడు డ్రోన్లు జమ్మూలోని మిలటరీ స్టేషన్ల వద్ద కలకలం రేపాయి. అయితే భారత్‌కు చెందిన కీలక స్థావరాలపై డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ దాడులకు పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై డ్రోన్ దాడి కేసుని ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది.