IIT BHU Student Molestation: వెలుగులోకి వచ్చిన దారుణం.. కాశీ ఐఐటీ బీహెచ్‌యూ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
ఘటన జరిగి ఏడు రోజులు గడిచినా పోలీసులు ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేకపోయారు. దీనిపై ఐఐటీ బీహెచ్‌యూ విద్యార్థుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది

వారణాసిలో ఐఐటీ బీహెచ్‌యూ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిందని సహ విద్యార్థులు తెలిపారు. ఈ విషయమై లంక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. అయితే తాజాగా సామూహిక అత్యాచారం, లైంగిక వేధింపులకు సంబంధించిన సెక్షన్‌ను పెంచారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా రెండు సెక్షన్లను పెంచారు. ఐఐటీ బీహెచ్‌యూలోని బీటెక్ విద్యార్థినిని కర్మన్ బీర్ బాబా ఆలయానికి కొంత దూరంలో నవంబర్ 1న తెల్లవారుజామున 1.30 గంటలకు బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులు వేధించారు.
వీడియో తీసి బయటికి చెప్పొద్దని బెదిరింపులు
ఆమెను వివస్త్రను చేసి వీడియో తీశారు. నిందితులు తన ప్రైవేట్ భాగాలను కూడా తాకినట్లు విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బలవంతంగా ఆమె బట్టలు విప్పి తీసిన వీడియోను వివిధ సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించారు. విద్యార్థి వాంగ్మూలం ఆధారంగా, లంక పోలీస్ స్టేషన్ నమోదు చేసిన కేసులో భారతీయ శిక్షాస్మృతిలోని 376 (డీ), 509 సెక్షన్లను కూడా నమోదు చేశారు. కేసు విచారణ కొనసాగుతోంది.
ఐఐటీ బీహెచ్‌యూ విద్యార్థిపై వేధింపులు, అసభ్యతకు సంబంధించి నమోదైన కేసును లంక పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ (క్రైమ్) సహజానంద్ శ్రీవాస్తవ దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, మేజిస్ట్రేట్ ఎదుట విద్యార్థి లిఖితపూర్వక వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే తాజాగా బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా సెక్షన్లు పెంచారు. నిందితులు తప్పించుకోలేరని, తొందరలోనే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని వారణాసి పోలీస్ కమిషనర్ ముఠా అశోక్ జైన్ అన్నారు.
ఏడు రోజులుగా నేరస్తులను గుర్తించలేకపోయిన పోలీసులు
అయితే, ఘటన జరిగి ఏడు రోజులు గడిచినా పోలీసులు ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేకపోయారు. దీనిపై ఐఐటీ బీహెచ్‌యూ విద్యార్థుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రేపిస్టులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఐఐటీ బీహెచ్‌యూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి ఐఐటీ డైరెక్టర్ కార్యాలయం ఎదుట మౌనంగా నిరసన తెలిపారు. అయితే 4 గంటలు దాటినా ఎవరూ కలవకపోవడంతో క్యాంపస్‌లో ర్యాలీ చేపట్టారు. నిందితులను పట్టుకునే వరకు వీధుల్లో కూర్చోవాలన్నది స్టూడెంట్స్ పార్లమెంట్ డిమాండ్ చేసింది.