IIT Kanpur : ప్లాస్టిక్ కన్నా యమ డేంజర్.. థర్మాకోల్ సమస్యకు అద్భుత పరిష్కారం చెప్పిన కాన్పూర్ ఐఐటీ
IIT Kanpur : దీన్ని డీకంపోజ్ చేయాలంటే కనీసం వెయ్యేళ్లు పడుతుంది. అంటే, భవిష్యత్ తరాలకు కూడా ఇది ఎంతో హాని కలిగించే విధంగా ఉంటుంది.

IIT Kanpur
IIT Kanpur – Thermocol : థర్మాకోల్.. పర్యావరణానికి ఇది ప్లాస్టిక్ కంటే యమ డేంజర్. థర్మా కోల్ డీ-కంపోజ్ కావాలంటే వెయ్యేళ్లు పడుతుంది. దీంతో పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కాన్పూర్ ఐఐటీ శాస్త్రవేత్తలు వినూత్న ప్రయోగం చేపట్టారు. కాదేదీ అనర్హం అన్నట్లు వ్యవసాయ వేస్టేజ్ తో థర్మాకోల్ తయారు చేసి పర్యావరణ ముప్పు తొలగించారు.
పర్యావరణ పరిరక్షణ కోసం కాన్పూర్ ఐఐటీ చేపట్టిన థర్మాకోల్ ప్రయోగం ప్రపంచ స్థిరత్వ దిశగా ముందడుగు పడనుంది. చూడటానికి చిన్న ప్రయోగమే అయినా ఎంతో మేలు చేసే విధంగా ఉంది. మార్కెట్ లో ఇప్పుడు లభిస్తున్న థర్మాకోల్ పర్యావరణానికి ఎంతో హాని కలిగిస్తోంది. దీన్ని డీకంపోజ్ చేయాలంటే కనీసం వెయ్యేళ్లు పడుతుంది. అంటే, భవిష్యత్ తరాలకు కూడా ఇది ఎంతో హాని కలిగించే విధంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఐఐటీ కాన్పూర్ కొత్త ప్రయోగం చేసింది.
Also Read..Psychiatric surgery: భారత్‌లో మొట్టమొదటిసారి సైకియాట్రిక్ సర్జరీ.. డిప్రెషన్ దూరం
ఐఐటీ కాన్పూర్ స్థాపించిన కినోకో బయోటెక్ కంపెనీ వ్యవసాయ చెత్తతో థర్మాకోల్ తయారు చేసింది. ఈ థర్మాకోల్ ను కేవలం 60 రోజుల్లోనే డీకంపోజ్ చేయవచ్చు. ఆ తర్వాత కూడా దీన్ని మరో రకంగా కూడా వినియోగించవచ్చు.
ప్లాస్టిక్ తో పర్యావరణానికి ఎంతో ముప్పు కలుగుతోందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, థర్మాకోల్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. వాస్తవానికి ప్లాస్టిక్ తో పోలిస్తే థర్మాకోల్.. పర్యావరణానికి ఎంతో హాని కలిగిస్తుందన్నారు ఐఐటీ కాన్పూర్ కు చెందిన కినోకో బయోటెక్ కంపెనీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అదితి. ప్లాస్టిక్ ను రీసైక్లింగ్ చేయవచ్చు కానీ, థర్మాకోల్ ను అలా చేయలేము అని చెప్పారాయన.
కినోకో బయోటెక్ కంపెనీ వ్యవస్థాపకుడు చైతన్య ఆలోచనే పర్యావరణహిత థర్మాకోల్ తయారీకి అంకురార్పణ జరిగిందన్నారు ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ అంకుశ్ శర్మ. ఈ విషయంలో ఫ్యాకల్టీ నుంచి పూర్తి మద్దతు ఉందని వెల్లడించారు. విభిన్న ప్రయోగాలు చేసే అవకాశం దక్కిందన్నారు. అనంతరం వీరికి తుదిరూపం ఇచ్చామని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ చెప్పారు. వ్యవసాయ పంటల వ్యర్థాలు ఫంగస్, బ్యాక్టీరియాను వినియోగించి థర్మాకోల్ ను రూపొందించామన్నారు.
పర్యావరణహిత ప్రయోగం అటు రైతులకు మేలు చేయనుంది. సాధారణంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యవసాయ పంట కోతలు పూర్తయ్యాక మిగిలిన వ్యర్ధాలను తగులబెడుతున్నారు. దీంతో పొగ కమ్మేసి దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతోంది. ఇకపై పంట వ్యర్థాలను తగులబెట్టాల్సిన అవసరం ఉండదు. పర్యావరణహిత థర్మాకోల్ తయారు చేసే కంపెనీలకు పంట వ్యర్థాలను అమ్మడానికి అవకాశం కలుగుతుంది. దీంతో రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్లు చెబుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్ లో లభించే థర్మాకోల్ వ్యవసాయ వ్యర్థాలతో తయారు చేస్తున్న థర్మాకోల్ కు ఎలాంటి వ్యత్యాసం లేదు. ధరలోనూ, పనితీరులోనూ పెద్దగా తేడా లేదు. రెండింటి ధర ప్రతీ గ్రాము 30 రూపాయలు పలుకుతోంది. అంతేకాదు పర్యావరణ హిత థర్మాకోల్ ధరను మరింత పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.