భారత్-చైనా మధ్య రేపు సరిహద్దు చర్చలు

తూర్పు లడఖ్ లో బలగాల ఉపసంహరణ, సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ చైనా దేశాలు గురువారం మెకానిజమ్ ఫర్ కన్సల్టేషన్ అండ్ కో-ఆర్డినేషన్(డబ్ల్యూఎంసీసీ) సమవేశాన్ని నిర్వహించనున్నాయి. ఇరు దేశాల సంయుక్త కార్యదర్శుల స్థాయిలో ఈ చర్చలు జరగనున్నాయి.
కాగా, గత నెలలో జరిగిన డబ్ల్యూఎంసీసీ 17వ సమావేశంలో.. వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల సత్వర ఉపసంహరణకు అంగీకరించిన విషయం తెలిసిందే. మే నెల నుంచి భారత్‌పై చైనా కయ్యానికి కాలుదువ్వుతోంది. జూన్ 17న జరిగిన గల్వాన్ లోయ హింసాత్మక ఘటన అనంతరం ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి.
అయితే సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాలు గత కొంతకాలంగా చర్చలు జరుపుతున్నాయి. కానీ సైనిక, దౌత్య స్థాయిల్లో సమావేశమైనప్పటికీ.. ఫింగర్ ప్రాంతం, డెప్సంగ్, గోగ్రాల నుంచి బలగాల ఉపసంహరణకు చైనా అంగీకరించడం లేదు. బలగాలను వెనక్కి పిలిపించుకుని.. సరిహద్దులో శాంతి నెలకొల్పేందుకు చైనా సరహకరించాలని భారత్ పిలుపునిచ్చింది.
మరోవైపు, భారత్ తో కలసి పని చేయడానికి తాము సిద్ధమని చైనా తెలిపింది. ఇరు దేశాల ముందున్న సరైన దారి పరస్పరం గౌవరించుకోవడమేనని మంగళవారం చైనా విదేశాంగశాఖ పేర్కొంది. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా భారత ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ స్పందిస్తూ…. మోడీ స్పీచ్‌ను విన్నాం. మనం దగ్గరి పొరుగు వాళ్లం. ఒక బిలియన్ జనాభాతో ఎదుగుతున్న దేశాలం మనం.
ఈ నేపథ్యంలో దైపాక్షిక సంబంధాల అభివృద్ధిలో భాగంగా ఇరు దేశాల ప్రజల ఆసక్తులను దృష్టిలో పెట్టుకొని స్థిరత్వం, శాంతితోపాటు ఈ రీజియన్, ప్రపంచ శ్రేయస్సు ముఖ్యం. కాబట్టి రెండు దేశాలు పరస్పర గౌరవం, మద్దతుతో ముందుకెళ్లాలి. ఇది దీర్ఘ కాల ఆసక్తులకు ఊతం ఇస్తుంది. అందుకే ఇండియాతో పని చేయడానికి చైనా సిద్ధంగా ఉంది. ఇరు దేశాల రాజకీయ నమ్మకాలు, దైపాక్షిక బంధాల వృద్ధి, యథార్థంగా సహకరించుకోవడానికి మా మధ్య ఉన్న వైరుధ్యాలను అధిగమించాల్సి ఉంటుందని అన్నారు.