కరోనాపై పోరాటానికి…సార్క్ దేశాలకు 74కోట్లు ప్రకటించిన మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : March 15, 2020 / 02:13 PM IST
కరోనాపై పోరాటానికి…సార్క్ దేశాలకు 74కోట్లు ప్రకటించిన మోడీ

Updated On : March 15, 2020 / 2:13 PM IST

కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవటానికి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజినల్ కో-ఆపరేషన్ (SAARC) సభ్యుల కోసం ఉమ్మడి స్వచ్ఛంద అత్యవసర నిధిని ఏర్పాటు చేయడానికి ఆదివారం(మార్చి-15,2020)10 మిలియన్ల డాలర్లను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆఫర్ చేశారు. ప్రపంచ దౌత్య చరిత్రలో అపూర్వమైన చర్యగా….సార్క్ యొక్క ఎనిమిది దేశాలు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి వెబ్-సమ్మిట్ ను నిర్వహించాయి.

బహిరంగ సభలు,సమావేశాలు నివారించడానికి డబ్ల్యూహెచ్‌ఓ సలహా దృష్ట్యా… ప్రధాని నరేంద్ర మోడీ ఈ చొరవ తీసుకున్నారు. ఈ ప్రతిపాదనను సార్క్ సభ్యులైన… ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక మరియు పాకిస్తాన్ దేశాలు స్వాగతించాయి మరియు అంగీకరించాయి.

కలిసికట్టుగా పోరాడితేనే కరోనాపై విజయం సాధించగలమని సార్క్ సభ్యులతో మోడీ అన్నారు. చైనా దేశంలో మొదటగా కరోనా వైరస్(COVID-19) వ్యాప్తి చెందినప్పటి నుండి ఈ మహమ్మారిని నివారించడానికి భారతదేశం తీసుకున్న చర్యలపై సార్క్ సభ్యులకు మొదటగా ఆదివారం సాయంత్రం వీడియో-కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన మంత్రి మోడీ తెలియజేశారు.

ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, భూటాన్ ప్రధాని లోటే థెరింగ్, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్, నేపాల్ ప్రధాని కె.పి. శర్మ ఒలి, శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స, పాకిస్తాన్ ఆరోగ్య శాఖ సహాయ మంత్రి జాఫర్ మీర్జా ఒకరి తర్వాత ఒకరు తమ తమ దేశాల్లో కరోనా మహమ్మారిని కంట్రోల్ చేసేందుకు తీసుకున్న చర్యల గురించి మాట్లాడుకున్నారు. ఇటీవలే సర్జరీ జరిగి ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఈ సమ్మిట్ లో నేపాల్ ప్రధాని కె.పి. శర్మ జాయిన్ అయ్యారు.

సార్క్ సభ్యదేశాలకు…. టెస్టింగ్ కిట్లు, ఇతర పరికరాలతో పాటు రాపిడ్ రెస్ఫాన్స్ మెడికల్ టీమ్స్ ను కూడా ప్రధాని మోడీ ఆఫర్ చేశారు. “అవసరమైతే వారు మీ వద్ద ఉంటారు” అని సార్క్ దేశాల సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ సమయంలో మోడీ అన్నారు. ఎమర్జెన్సీ స్టాఫ్ కెపాసిటీ పెంచడానికి మెడికల్ ఎమర్జెన్సీ టీమ్ లకు ఆన్‌లైన్ ట్ర్రైయినింగ్ క్యాప్సుల్స్ ను కూడా భారత్ అందించగలదని మోడీ అన్నారు.

 వైరస్ క్యారియర్స్ యొక్క ఇంటిగ్రేటెడ్ డిజిటల్ డేటాబేస్ ను సార్క్ సభ్యులు సృష్టించవచ్చని ప్రధాని సూచించారు. సార్క్ విపత్తు నిర్వహణ వంటి ముందుగా ఉన్న సౌకర్యాలను ఉపయోగించాలన్నారు. భవిష్యత్ కోసం దక్షిణాసియాలో అంటువ్యాధుల నియంత్రణ కోసం ఒక కామన్ రీసెర్చ్ ఫ్లాట్ ఫాం(సాధారణ పరిశోధనా వేదిక)ను ఏర్పాటు చేయాలని మోడీ ఈ సందర్భంగా ప్రతిపాదించారు. ఇలాంటి విధానాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్)  సమన్వయం చేయగలదని మోడీ అన్నారు. సార్క్ సభ్యులందరూ సంయుక్తంగా COVID-19 యొక్క ఆర్థిక పరిణామాలను రివ్యూ చేయాలని, వైరస్ ప్రభావం నుండి స్థానిక వాణిజ్యం మరియు వ్యాల్యు చైన్స్ ను నిరోధించాలని మోడీ సూచించారు.

ఇవాళ నిర్వహించడిన ఈ వీడియో-సమ్మిట్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 2016 నుండి, సార్క్ యాక్టివ్ గా లేదు. పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన ఉరి ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో నిర్ణయించిన 2016 సార్క్ సదస్సులో పాల్గొనడానికి ప్రధాని మోడీ నిరాకరించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మరియు భూటాన్ కూడా మీట్ నుండి వైదొలిగిన తరువాత, ఆ సమ్మిట్ నిలిపివేయబడింది. సార్క్ సమ్మిట్ రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. అక్షర క్రమంలో(ఆల్ఫాబెటికల్ ఆర్డర్) సభ్య దేశాలు వీటిని నిర్వహిస్తాయి. చివరిగా సమ్మిట్ 2014 లో నేపాల్‌ లోని ఖాట్మండులో జరిగింది.