మోడీ బయోపిక్ : 7న ఫస్ట్ లుక్

ఢిల్లీ : బాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్‌లో అయినా ఇప్పుడు బయోపిక్‌ల మీదే దర్శకులు దృష్టి. చాయ్‌వాలా నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన చరిత్ర ఆయనది. దేశ ప్రజల్లో ఆశలు రేపిన నాయకత్వ చాతుర్యం ఆయనది. ఆయనే ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇప్పుడు ఆయన జీవిత చరిత్ర వెండితెరపై రాబోతోంది. ఈ చిత్రానికి ‘పీఎం నరేంద్రమోదీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో రీల్ లైఫ్ మోదీ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కనిపించబోతున్నారు. గడచిన కొద్ది కాలంగా అనధికార వార్తగా చక్కర్లు కొడుతోన్న మోదీ బయోపిక్… ఇప్పుడు అధికారికంగా ఖరారైపోయింది. ఈ చిత్రానికి ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఈనెల 7న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నారు. 15వ తేదీ నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతోంది.
ప్రధాని మోదీ బయోపిక్ పేరు ఖరారు
ఒమంగ్ కుమార్ దర్శకత్వం
మోదీగా వివేక్ ఒబెరాయ్
7న ఫస్ట్ లుక్ విడుదల
15 నుంచి చిత్రీకరణ
ఇప్పటికే రాజకీయ నేతల జీవితాధారంగా బయోపిక్‌లు వివిధ భాషల్లో క్యూ కడుతున్నాయి. అలనాటి నటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవితాధారంగా యన్‌టీఆర్ బయోపిక్ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారత మాజీ ప్రధాని మన్మోహన్ జీవితాధారంగా ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. మరోపక్క దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితాధారంగా ది ఐరన్ లేడీ అనే బయోపిక్ తెరకెక్కుతోంది. మహారాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి, శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే జీవితాధారంగా కూడా ఠాక్రే పేరుతో చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, ఠాక్రే చిత్రాల ట్రైలర్లు ఇప్పటికే విడుదలై సంచలనం రేపుతున్నాయి. బాలీవుడ్‌లో మేరీ కోమ్, సరబ్‌జీత్ లాంటి అద్భుతమైన బయోపిక్‌లను తెరకెక్కించిన ఒమంగ్ కుమార్ ఇప్పుడు నరేంద్ర మోదీ సినిమాను తెరకెక్కించబోతున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి.
సినీ పరిశ్రమలో బయోపిక్‌లకు గిరాకీ
విడుదలకు సిద్ధంగా మన్మోహన్, బాల్ ఠాక్రే బయోపిక్‌లు
ది ఐరన్ లేడీగా జయలిలత జీవిత కథ
మేరీకోమ్, సరబ్‌జీత్ చిత్రాకు మంచి పేరు