Donkey Population: రోజురోజుకు దేశంలో తగ్గిపోతున్న గాడిదల సంఖ్య.. కారణం ఏంటి?
దేశంలోని పలు రాష్ట్రాల్లో గాడిదల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.

Donkey
Donkey Population: దేశంలోని పలు రాష్ట్రాల్లో గాడిదల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కిలోమీటర్ల దూరం వీపుపై మనుషులు మోయలేని బరువును ఒకచోటి నుంచి మరోచోటికి తీసుకెళ్లేందుకు విరివిగా ఉపయోగించేవారు. రవాణా సాధనాలు పెరగడం వల్ల గాడిదల వినియోగం రోజురోజుకూ తగ్గిపోయింది.
ఇప్పుడు దేశంలో గాడిదల సంఖ్య రికార్డు స్థాయిలో తగ్గుముఖం పట్టింది. పశుగణన 2019 ప్రకారం, ఏడేళ్లలో గాడిదల సంఖ్య తగ్గడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2012 నుంచి 2019 మధ్యకాలంలో దేశంలో గాడిదల సంఖ్య 61.23శాతం తగ్గిపోయింది.
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లలో తగ్గిపోయిన గాడిదలు:
ఉత్తరప్రదేశ్‌లో గాడిదల సంఖ్య 71.72 శాతం తగ్గింది. రాష్ట్రంలో 2012లో 57 వేలుగా ఉన్న గాడిదలు 2019 నాటికి 16 వేలకు తగ్గాయి. రాజస్తాన్‌లో గాడిదల సంఖ్య 71శాతం తగ్గాయి. రాష్ట్రంలో 2012లో 81 వేల గాడిదలు ఉండగా, 2019 నాటికి 23వేలకు తగ్గాయి. గుజరాత్‌లో గాడిదల సంఖ్య 70.94 శాతం తగ్గిపోయాయి. రాష్ట్రంలో 2012లో 39 వేల గాడిదలు ఉండగా, 2019 నాటికి 11 వేలకు తగ్గాయి.
బీహార్, మహారాష్ట్రల్లో..
వాస్తవానికి మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో గాడిదల సంఖ్య చాలా తక్కువ. తెలుగు రాష్ట్రాలకు బీహార్, మహారాష్ట్రల నుంచే గాడిదలను తీసుకుని వచ్చి వినియోగిస్తూ ఉంటారు. అయితే, ఆయా రాష్ట్రాల్లో కూడా గాడిదల సంఖ్య బాగా తగ్గిపోయింది.
బీహార్‌లో గాడిదల సంఖ్య 47.31 శాతం తగ్గింది. రాష్ట్రంలో మొత్తం గాడిదలు 2012లో 21వేలు ఉండగా, 2019లో 11వేలకు తగ్గాయి. మహారాష్ట్రలో గాడిదల సంఖ్య 39.69 శాతం తగ్గింది. రాష్ట్రంలో 2012లో 29 వేల గాడిదలు ఉండగా, 2019 నాటికి 18 వేలకు తగ్గాయి. పశుగణన 2019 ప్రకారం, భారతదేశంలో 1.12 లక్షల గాడిదలు ఉన్నాయి.
కారణం ఏంటి?
గాడిదల సంఖ్య తగ్గడానికి ముఖ్యమైన కారణం.. ఇతర దేశాలకు గాడిదల అక్రమ ఎగుమతి. చాలా దేశాల్లో, ప్రజలు గాడిద మాంసాన్ని తింటారు. వాటి పాలను కూడా చాలా విషయాల్లో ఉపయోగిస్తారు. విదేశాల్లో గాడిదలను భారీ రేటుకు కొంటారు కూడా. ఈ క్రమంలోనే చాలామంది వ్యాపారులు అక్రమంగా గాడిదలను కొనుగోలు చేసి అమ్ముతున్నారు.
దానికితోడు మనదేశంలో కూడా గాడిదలను మాంసం కోసం వధించడం వల్ల వాటి సంఖ్య తగ్గింది. చైనాలో కూడా గాడిదలను మెడిసిన్‌లో ఉపయోగిస్తారు. ఇది కూడా దేశంలో గాడిదల సంఖ్య తగ్గడానికి మరో కారణంగా చెబుతున్నారు.
గాడిద తోలు నుంచి ఉత్పత్తి అయ్యే జెలటిన్ అనే ఒక పదార్ధం చైనా సాంప్రదాయ ఔషద తయారిలో కీలకమైన పదార్ధం, దీనిని ఎజియావో అని పిలుస్తారు. జలుబు నుంచి నిద్రలేమి వరకు అనేక రకాల వ్యాధుల చికిత్సకు దీనిని ఉపయోగిస్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీరాలలో..
కోడిని, మేకను తినేవారు పెరిగినట్టే గాడిద మాంసం తినేవాళ్లు పెరగటం కూడా గాడిదల మనుగడకు ముప్పుగా మారింది. మనిషి గాడిద మాంసానికి అలవాటు పడిపోతున్నాడు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీరాల గాడిద మాంసానికి ఫేమస్.
క్రీడాకారులు, బరువైన పనులు చేసేవాళ్లు గాడిద రక్తం తాగేందుకు చీరాలకు వెళ్లేవారు. వేకువజామునే గాడిదను కోసి పట్టిన రక్తాన్ని తాగేసి వీధుల్లో పరిగెత్తేవారు. మాంసాన్ని వండించుకుని తినేవారు. గాడిద రక్తం, మాంసం ఆరోగ్యానికి మంచిదనే ప్రచారం ఉండేది. స్టూవర్ట్‌పురం నేరస్తులు గాడిద రక్తాన్ని, మాంసాన్ని తీసుకుని బలంగా తయారయ్యారని అప్పట్లో చెప్పుకునేవారు.