PM Modi: తన 11 ఏళ్ల పాలనపై ప్రధాని మోదీ ఆసక్తికర కామెంట్స్
ఈ సందర్భంగా నరేంద్ర మోదీ ఓ లింకును షేర్ చేశారు.

PM Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారం చేపట్టి ఏడాదైంది. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి 11 ఏళ్లు అవుతుంది. దీనిపై మోదీ స్పందిస్తూ.. వరసగా ట్వీట్లు చేశారు. ఈ 11 సంవత్సరాలలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు.
అంతేగాక, వాతావరణ, డిజిటల్ ఆవిష్కరణలు వంటి సమస్యలపై ప్రపంచంలో గళం విప్పుతున్న కీలక దేశంగా ఉందని చెప్పారు. సుపరిపాలనపై దృష్టి పెట్టడం, అభివద్ధి కోసం కీలక రంగాల్లో మార్పులు వంటివి చేశామని అన్నారు. 140 కోట్ల భారతీయుల ఆశీర్వాదాలు, సామూహిక భాగస్వామ్యంతో విభిన్న రంగాలలో వేగంగా మార్పులను చూశామని అన్నారు.
‘సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వస్, సబ్కా ప్రయాస్’ వంటి మార్గదర్శకాలతో ఎన్డీఏ ప్రభుత్వం వేగంగా కీలక మార్పులను చేసిందని తెలిపారు. ప్రజల జీవన స్థితిగతుల మెరుగుదల అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక వృద్ధి నుంచి సామాజిక అభ్యున్నతి వరకు అన్ని రంగాల్లోనూ అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా నరేంద్ర మోదీ ఓ లింకును షేర్ చేశారు. ప్రస్తుత కేంద్ర మంత్రులలో 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందినవారు ఉన్నారని అందులో పేర్కొన్నారు. మరోవైపు, తమ సర్కారు మహిళాభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారని, చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసించారు. మహిళా సాధికారత కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.