భారత ఆర్మీ నర్సింగ్ వెబ్ సైట్ హ్యాక్.. హిందువులపై దారుణమైన మెసేజ్..
"మీ మతం మిమ్మల్ని రక్షించదు, మీ మతమే మీ మరణానికి కారణం అవుతుంది. మేము చాలా సుపీరియర్, పవర్‌ఫుల్" అని అందులో హ్యాకర్లు రాసుకొచ్చారు.

భారత ఆర్మీకి చెందిన నర్సింగ్ కాలేజ్ వెబ్‌సైట్ ఇవాళ హ్యాక్ అయింది. “హిందువులను చంపండి”, “ముస్లింలను గౌరవించండి” అంటూ అందులో హ్యాకర్లు ఓ మెసెజ్ పోస్ట్ చేశారు. ఉర్దూతో పాటు ఇంగ్లిష్‌లో రెండు పేరాగ్రాఫ్‌లలో రాతలు రాస్తూ బెదిరించే ప్రయత్నాలు చేశారు.
“మీ వెబ్‌సైట్‌ను మా టీమ్ ఇన్‌సేక్ పీకే హ్యాక్ చేసింది” అని అందులో హ్యాకర్లు పేర్కొన్నారు. “మా మతం, ఆచారాలు మీ మతం ఆచారాలకు కొన్ని మైళ్ల దూరంలో ఉన్నాయి (ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి). ఇదే మమ్మల్ని శక్తిమంతం చేస్తోంది. రెండు దేశాల సిద్ధాంతం కేవలం ఒక భావన మాత్రమే కాదు, ఇదే నిజం. మేము ముస్లింలం, మీరు హిందువులు. అల్లా మాతో ఉన్నాడు. మీ మతం మిమ్మల్ని రక్షించదు, మీ మతమే మీ మరణానికి కారణం అవుతుంది. మేము చాలా సుపీరియర్, పవర్‌ఫుల్” అని అందులో హ్యాకర్లు రాసుకొచ్చారు.
సాధారణంగా యుద్ధాలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వాలకు సంబంధించిన వెబ్‌సైట్లు హ్యాక్ అవుతుంటాయి. కాగా, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ యుద్ధ విమానాల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అలర్ట్ ప్రకటించాయి. జమ్మూకశ్మీర్ నుండి అరేబియన్ సముద్రం వరకూ త్రివిధ దళాలను అప్రమత్తం చేశారు.
ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం శ్రీనగర్ చేరుకున్నారు. ఆయన వెంట 15 కాప్స్ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ ప్రశాంత్ శ్రీవాస్తవ, విక్టర్ ఫోర్స్ కమాండర్ ఉన్నారు. జనరల్ ద్వివేది ఎల్ఓసీ, ఇతర సరిహద్దు ప్రాంతాలపై ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష నిర్వహించనున్నారు. బలగాల మోహరింపు, ఇంటెలిజెన్స్ సమాచారం, చొరబాట్ల నిరోధక చర్యలను సీనియర్ అధికారులు వివరిస్తారు.
పహల్గాం దాడికి ప్రతిస్పందనగా భారత్ ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ వెంటనే దౌత్యపరమైన ఒత్తిడిని తీవ్రతరం చేయడమే కాకుండా, పాకిస్తాన్ ఆర్థికంగా కోలుకోలేని విధంగా సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది.
అయినప్పటికీ, పహల్గాం ఘటనలో నేరుగా పాల్గొన్న ఉగ్రవాదులను శిక్షించాలని దేశవ్యాప్తంగా ప్రజల నుంచి డిమాండ్ వెల్లువెత్తుతోంది. పాకిస్థాన్‌పై భారత్ నేరుగా ప్రతీకారం తీర్చుకునే విధానం ప్రధాన చర్చాంశంగా మారింది. సైనిక చర్యల విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉన్న పాకిస్థానీయులను స్వదేశానికి తిరిగి పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.