Indian Navy: 10 రకాల యుద్ధ నౌకలతో భారత నేవీ ఆపరేషన్స్.. దేశ భ‌ద్రత‌లో కీ రోల్

నీరు, నేల, నింగి ఇలా ఏ వైపు నుంచి వచ్చే విపత్తునైనా ఎదుర్కొనే సత్తా మన సొంతం.

Indian Navy: 10 రకాల యుద్ధ నౌకలతో భారత నేవీ ఆపరేషన్స్.. దేశ భ‌ద్రత‌లో కీ రోల్

Indian Navy

భార‌త నేవీ.. దేశ త్రివిధ ద‌ళాల్లో ఒక‌టి. నింగి, నేలలో శత్రువులను ఎదుర్కొనేందుకు ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ ఎలా పనిచేస్తోందో.. సముద్ర జలాల్లో కవ్వింపులను నేవీ కూడా అలానే తిప్పికొడుతుంది. దొడ్డిదారిన భారత్‌లోకి చొరబాట్లు జరగకుండా..శ‌త్రుదేశాలు స‌ముద్ర జ‌లాల‌ను అడ్డుపెట్టుకుని చేస్తోన్న ఉగ్రవాద కార్యక్రమాల‌కు ఎప్పటికప్పుడు చెక్ పెడుతోంది.

డ్రగ్స్, ఇత‌ర‌ అక్రమ ర‌వాణాల‌ను కూడా క‌ట్టడి చేస్తూ.. దేశ భ‌ద్రత‌లో కీరోల్ ప్లే చేస్తోంది. ఈ క్రమంలోనే మనదేశ నౌకలతో పాటు, ఇతర దేశాలను నౌకలను హైజాక్ చేసేందుకు స‌ముద్రదొంగ‌లు చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెడుతున్నారు నేవీ సిబ్బంది. సముద్ర జలాల్లో శాంతిని బలోపేతం చేయడం సహా దోపిడీని అడ్డుకోవడంలో భారత నేవీ బలగాలు సత్తా చాటుతున్నాయి.

హౌతీ తిరుగుబాటుదారుల దాడులు
ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై కొంతకాలంగా హౌతీ తిరుగుబాటుదారుల దాడులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో పది ప్రత్యేక యుద్ధనౌకలతో జలమార్గాలపై నిఘా పెట్టి ర‌క్షణ‌గా నిలుస్తోంది ఇండియన్ నేవీ. హిందూ మహాసముద్రంలోనూ కొన్నాళ్లుగా వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను భారత నౌకాదళం అడ్డుకొని వాటిలోని సిబ్బందిని రక్షించింది.

కీలకమైన సముద్రమార్గాలను దృష్టిలో పెట్టుకొని భారత నౌకాదళం ఫ్రంట్‌లైన్‌ నౌకలు, నిఘా విమానాలతో సముద్ర భద్రతను మ‌రింత పెంచింది. ఈ మధ్య ల‌క్షద్వీప్‌లోనూ నిఘాను ముమ్మరం చేశారు. యుద్ధనౌకలు.. మన నేవీ సిబ్బంది సత్తా.. దొంగలను ఆటకట్టించడానికి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఐఎన్ఎస్ సుమేధ, ఐఎన్ఎస్ త్రిశూల్‌, ఐఎన్ఎస్ కోల్‌కతా.. ఇలా కీలకమైన పది రకాల యుద్దనౌకలతో నేవీ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి.

ఇక భారత్ కోస్ట్ గార్డ్స్, నేవీ సిబ్బంది ధైర్య సాహాసాలు కూడా వర్ణించలేనివి. సముద్రదొంగలతో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు సిబ్బంది. మార్కోస్ దళం అయితే నేవీలో అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ప్రత్యేకంగా క్లిష్ట సమయాలు, ప్రతికూల వాతావరణంలో శత్రువులను అంతం చేయడంలో ఈ దళం కీలకంగా పనిచేస్తుంది.

సముద్రపు దొంగలు హడల్
మార్కోస్‌ దళం పేరెత్తితే చాలు.. సముద్రపు దొంగలు హడలెత్తిపోతారు. భారత్‌లోని అతి శక్తివంతమైన ఎనిమిది కమాండో దళాల్లో మార్కోస్‌ ఒకటి. 1987లో ఏర్పాటైన ఈ దళంలో వెల్ ట్రెయిన్‌డ్ సిబ్బంది ఉంటారు. యూఎస్‌ నేవీ సీల్స్‌ మాదిరిగా రూపొందిన మార్కోస్ దళం టీమ్..వీరు వివిధ రంగాల్లో ప్రొఫెషనల్ ట్రెనింగ్‌తో పొంది ఉంటుంది. అత్యున్నత శిక్షణ, అన్ని రకాలు అడ్వాన్స్‌డ్‌ ఆయుధాలు వాడటంలోనూ ట్రైన్ అయి ఉంటారు సిబ్బంది. ప్రతికూల వాతావరణం, పరిస్థితులను సైతం సమర్థంగా ఎదుర్కొంటారు.

నీరు, నేల, నింగి ఇలా ఏ వైపు నుంచి వచ్చే విపత్తునైనా ఎదుర్కొనే సత్తా వీరి సొంతం. అవసరమైనప్పుడు భారత ఆర్మీతో సమన్వయం చేసుకుంటూ సెన్సిటీవ్ ప్లేస్‌లలో సంయుక్త ఆపరేషన్లు చేపడతారు. భయమంటే తెలియని ధీరులుగా వీరిని తయారు చేస్తారు. తుఫాన్‌ లాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా వీరి సేవలను వినియోగిస్తారు. 26/11 ముంబై ఉగ్రదాడిలో, శ్రీలంకలో ఎల్టీటీఈ తీవ్రవాదుల అణచివేతలో వీరు తమ సేవలందించారు.

పటిష్టమైన ఆయుధ సామగ్రి, దృఢమైన సైనికబలం, అంతకమించి ధైర్య సాహసాలతో సముద్రంలో శత్రువులను ఆటకట్టిస్తోంది నేవీ. ప్రయత్నమంటూ మొదలుపెడితే విజయంతోనే తిరిగి వస్తోంది. ప్రపంచదేశాల్లో ఏ దేశానికి సాధ్యం కాని ఆపరేషన్స్ మన నేవీతోనే అవుతున్నాయి. కొన్నాళ్లుగా బయటికి వస్తున్న డ్రగ్స్ ముఠాలు, పైరేట్స్ అరెస్టులు నేవీ సత్తాను తెలియజేస్తాయి.

 Also Read: పాకిస్థాన్‌, చైనా కుట్రలను గమనిస్తూనే భారత నౌకాదళం ఇంకా ఏం చేస్తోందో తెలుసా? ఢీ అంటే ఢీ..