Indian Railways: రైల్వే ఛార్జీలు పెరిగాయ్.. కొత్త ఛార్జీలు ఎంతంటే..? హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ఏసీ క్లాస్‌లో పెరిగిన ఛార్జీలు ఇలా..

రైల్వే టికెట్ ధరలను స్వల్పంగా పెంచుతూ భారతీయ రైల్వే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పెరిగిన ఛార్జీలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి.

Indian Railways: రైల్వే ఛార్జీలు పెరిగాయ్.. కొత్త ఛార్జీలు ఎంతంటే..? హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ఏసీ క్లాస్‌లో పెరిగిన ఛార్జీలు ఇలా..

Railways Fare Hike

Updated On : July 1, 2025 / 7:21 AM IST

Railways Fare Hike: రైల్వే టికెట్ ధరలను స్వల్పంగా పెంచుతూ భారతీయ రైల్వేలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జులై 1వ తేదీ నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఏసీ తరగతుల్లో కిలో మీటరుకు రెండు పైసలు, నాన్ ఏసీలో కిలో మీటరుకు ఒక పైసా చొప్పున ఛార్జీల పెంపు అమల్లోకి వచ్చింది. నూతన చార్జీల పట్టికను సోమవారం రైల్వేశాఖ విడుదల చేసింది. 2020లో ఛార్జీల సవరణ తరువాత దాదాపు ఐదేళ్లకు మళ్లీ రైల్వేశాఖ చార్జీలను పెంచింది.

ఇప్పటికే రిజర్వేషన్ చేసిన టికెట్లకు పెంచిన ఛార్జీలు అమలుకావని రైల్వేశాఖ తెలిపింది. రోజువారీ ప్రయాణికుల ప్రయోజనాల దృష్ట్యా సబర్బన్ రైళ్ల ఛార్జీలు, నెలవారీ సీజన్ టికెట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని తెలిపింది.

దేశవ్యాప్తంగా రైల్వేశాఖ కొత్తగా ప్రకటించిన ఛార్జీల పెంపు వివరాలు
♦ సెకండ్‌ క్లాస్‌ ఆర్డినరీకి 500కిలో మీటర్ల వరకు సాధారణ ఛార్జీలే ఉండనున్నాయి.
♦ 501 కిలో మీటర్లు నుంచి 1500 కిలోమీటర్లు వరకు టికెట్‌పై రూ.5 పెరిగింది.
♦ 1501 కిలో మీటర్లు నుంచి 2500 కిలోమీటర్లు వరకు టికెట్‌పై రూ.10. పెరిగింది.
♦ 2501 కిలోమీటర్లు నుంచి 3వేల కిలోమీటర్లు వరకు టికెట్‌పై రూ.15 చొప్పున పెరిగింది.
♦ ఆర్డనరీ స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఆర్డనరీ టికెట్లపై కిలో మీటరుకు అరపైసా చొప్పున పెంచగా.. మెయిల్/ ఎక్స్‌ప్రెస్ (నాన్ ఏసీ) రైళ్లలో టికెట్లపై నాన్ ఏసీ ఫస్ట్, సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ టికెట్లపై కిలోమీటరుకు ఒక పైసా చొప్పున పెంచారు.
♦ అన్నిరకాల రైళ్లలో ఏసీ అన్ని తరగతులకు కిలో మీటరుకు రెండు పైసలు చొప్పున పెరిగింది.

హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ఏసీ క్లాస్‌లో పెరిగిన ఛార్జీలు..
♦ హైదరాబాద్ – ఢిల్లీ (సుమారు 1700 కిలోమీటర్లు) రూ.34అదనం.
♦ హైదరాబాద్ – ముంబయి (సుమారు 700 కిలోమీటర్లు) రూ.14 అదనం.
♦ హైదరాబాద్ – అయోధ్య (సుమారు 1400 కిలో మీటర్లు) రూ. 28 అదనం.

రాజధాని, శతాబ్ది, దురంతో, వందేభారత్, తేజస్, అమృత్ భారత్ వంటి ప్రీమియర్ రైళ్లకూ కొత్త రుసుములు వర్తిస్తాయి.