ఇండియాలోనే బిగ్గెస్ట్ ‘డిజిటల్ అరెస్ట్’ స్కాం.. లేడీ డాక్టర్ నుంచి మూన్నెళ్లలో రూ.19కోట్లు దోచుకున్నారు.. పోలీసుల ఎంట్రీతో వీడిన అసలు గుట్టు..

భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ స్కాం గుజరాత్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. మహిళా వైద్యురాలి నుంచి రూ.19కోట్లను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు.

ఇండియాలోనే బిగ్గెస్ట్ ‘డిజిటల్ అరెస్ట్’ స్కాం.. లేడీ డాక్టర్ నుంచి మూన్నెళ్లలో రూ.19కోట్లు దోచుకున్నారు.. పోలీసుల ఎంట్రీతో వీడిన అసలు గుట్టు..

Digital Arrest Scam

Updated On : July 29, 2025 / 8:55 AM IST

Digital Arrest Scam in Gujarat: భారతదేశంలో అతిపెద్ద ‘డిజిటల్ అరెస్ట్’ స్కాం గుజరాత్ రాష్ట్రంలో వెలుగు చూసింది. మహిళా వైద్యురాలి నుంచి రూ.19కోట్లను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. వారు పెట్టే ఇబ్బందులను తాళలేక వైద్యురాలు.. సూరత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఈ డిజిటల్ అరెస్ట్ స్కాంలో ప్రమేయం ఉన్న ఓ నిందితుడిని అరెస్టు చేశారు.. అతని వద్ద బ్యాంకు ఖాతాలో కోటి రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం నెట్‌వర్క్‌ను చేదించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.

గాంధీనగర్ కు చెందిన ఓ మహళా వైద్యురాలు ఈ ‘డిజిటల్ అరెస్ట్’ స్కాంలో చిక్కుకుంది మార్చి 15 నుంచి జూన్ 25వ తేదీ వరకు మూడు నెలల్లో సైబర నేరగాళ్లు ఆమె నుంచి రూ.19.25 కోట్లు దోచుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మార్చి 15వ తేదీన టెలికమ్యూనికేషన్స్ విభాగానికి చెందిన జ్యోతి విశ్వనాథ్ అనే పేరుతో మహిళా వైద్యురాలికి ఫోన్ కాల్ వచ్చింది. మీ ఫోన్ నుంచి అభ్యంతరకరమైన కంటెంట్ కనిపించిందని, మీ ఫోన్ కనెక్షన్‌ను డిస్‌కనెక్ట్ చేస్తానని, మీపై మనీలాండరింగ్ కేసు పెడతానని ఆ వ్యక్తి బెదిరించాడు.

మరుసటి రోజు నుంచి నకిలీ కాల్స్ రావడం మొదలయ్యాయి. సబ్ ఇన్‌స్పెక్టర్, ప్రభుత్వ న్యాయవాది, నోటరీ ఆఫీసర్ పేరిట వాట్సాప్, స్కైప్ కాల్స్ ద్వారా వైద్యురాలిని బెదిరించారు. మీపై మనీలాండరింగ్ కేసు నమోదు చేయబడిందని, దాని నుంచి తప్పించుకోవాలంటే మేము చెప్పినట్లు చేయాలంటూ వైద్యురాలిని డిజిటల్ అరెస్ట్ చేశారు.

వరుసగా కాల్స్ రావడంతోపాటు.. మేము చెప్పినట్లు వినకుంటే మీరు పెద్దప్రమాదంలో పడతారంటూ బెదిరింపులకు గురిచేయడంతో వైద్యురాలు భయంతో వారి చెప్పినట్లు చేసేందుకు ఒప్పుకుంది. దీంతో సదరు వైద్యురాలు 35 వేరువేరు బ్యాంకు ఖాతాలకు మూడు నెలల్లో రూ.19.25కోట్లను బదిలీ చేసింది. వైద్యురాలి ఆభరణాలనుసైతం తాకట్టు పెట్టిరుణం తీసుకొని ఆ నిధులను కూడా తమ ఖాతాలకు సైబర్ మోసగాళ్లు బదిలీ చేయించుకున్నారు.

ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడల్లా వీడియో కాల్స్ ద్వారా ఆమె ఎక్కడ ఉందో తెలియజేస్తూ.. నిరంతరం మీ కదలికలను గమనిస్తున్నామని భయపెడుతూ వేదింపులకు గురిచేశారు. ఒకరోజు కాల్స్ రావడంతో ఆగిపోవటంతో.. ఆ వైద్యురాలు బంధువులకు విషయాన్ని తెలియజేసింది. దీంతో జూలై 16న అందిన ఫిర్యాదు మేరకు గుజరాత్ లోని సీఐడీ క్రైమ్ సైబర్ సెల్ రంగంలోకి దిగింది.

సైబర్ మోసగాళ్ల గుట్టువిప్పేందుకు సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని బ్యాంకు ఖాతాలో రూ. కోటి నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కాంలో ప్రమేయం ఉన్న మరికొంత మంది వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు నిందితుడ్ని విచారిస్తున్నారు. ఈ మొత్తం ఆపరేషన్ వెనక ఉంది ఎవరు.. ఎంత మంది ఉన్నారు.. అనే వివరాలు సేకరించి వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.