నో ఫుడ్..రాత్రంతా నిలిచి ఉన్న విమానంలోనే ప్రయాణికులు

ప్రయాణికులను బుధవారం(సెప్టెంబర్-4,2019) రాత్రంతా నిలిచి ఉన్న విమానంలో బలవంతంగా ఉంచిందని “ఇండిగో”పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA విచారణకు ఆదేశించింది.
ముంబై నుంచి జైపూర్ కి వెళ్లవలసిన ఇండిగో విమానం… బుధవారం రాత్రంతా ముంబై ఎయిర్‌పోర్టులో ఉండిపోయింది. జైపూర్‌లో బుధవారం రాత్రి 7.55కి దిగాల్సిన విమానం… ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచీ టేకాఫ్ అవ్వలేదు. రాత్రంతా విమానంలోనే ప్రయాణికులు ఉండిపోయారు. ఎన్ని గంటలైనా ప్రయాణికుల్ని మాత్రం కిందకు దిగవద్దని ఫ్లైట్ ఇంజినీర్లు ఆదేశించారు. గురువారం(సెప్టెంబర్-5,2019) ఉదయం 6 గంటలకు ముంబై నుంచి టేకాఫ్ అయిన విమానం… ఉదయం 8 గంటలకు జైపూర్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయింది.
నాలుగు రోజుల నుంచి ముంబైలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. వీటిలో ఎక్కువగా ఇండిగో విమానాలే ఉన్నాయి. అయితే తమను రాత్రంతా విమానంలో ఎందుకు ఉంచేశారని ప్రయాణికులు మండిపడుతున్నారు. తమకు కనీసం భోజనం పెట్టలేదనీ… తమను విమానం దిగనిస్తే… ఎయిర్‌పోర్ట్‌లో డిన్నర్ చేసేవాళ్లమని ప్రయాణికులు ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై అందరూ కోపంతో ఉన్నారని ఓ ప్రయాణికుడు తెలిపారు. రాత్రంతా ప్రయాణికులను విమానంలోనే ఎందుకు ఉంచాల్సి వచ్చిందో తక్షణం విచారణకు ఆదేశించినట్లు డీజీసీఏ తెలిపింది.