Kejriwal: యమునా నది ఉద్ధృతిని ఇలా తగ్గించొచ్చు: అమిత్ షాకు కేజ్రీవాల్ లేఖ
ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగబోతుందని గుర్తు చేశారు.

Arvind Kejriwal
Kejriwal – Delhi Yamuna River: ఢిల్లీలో కురుస్తోన్న భారీ వర్షాల ధాటికి అక్కడ యమునా నది నీటి మట్టం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit shah)కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు. హత్నికుండ్ నుంచి పరిమిత పరిమాణంలోనే నీటిని విడుదల చేయాలని, దీనివల్ల యమునా నీటి మట్టం మరింత పెరగకుండా ఉంటుందని తెలిపారు.
ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగబోతుందని గుర్తు చేశారు. ఈ సమయంలో ఒకవేళ ఢిల్లీలో వరదలు వస్తే ప్రపంచానికి మంచి సందేశం ఇవ్వదని తెలిపారు. యమునా నదిలో ప్రమాదకర స్థాయి దాటిన వదర ఉద్ధృతి ఉందని తెలిపారు. ఇవాళ రాత్రికి యమునా నది ప్రవాహం 207.72 మీటర్ల కు చేరుతుందని కేంద్ర జలసంఘం అంచనా వేసిందని తెలిపారు.
ఇది ఢిల్లీకి మంచి పరిణామం కాదని అన్నారు. ఢిల్లీలో రెండు రోజుల నుంచి వర్షాలు లేవని, అయినప్పటికీ హరియాణాలోని హత్నికుండ్ బ్యారేజ్ నుంచి విడుదల అవుతున్న నీటితో యమునాలో నీటి ప్రవాహం పెరుగుతోందని వివరించారు. నీరు విడుదల చేయకుండా కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.
మరోవైపు, ఢిల్లీలో వరద సహాయ శిబిరాలను ఢిల్లీ మంత్రి అతిషి (Atishi Marlena) సందర్శించారు. సహాయక శిబిరాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు. యమునా నదిలో నీటిమట్టం నిరంతరం పెరుగుతోందని చెప్పారు. తాము ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.