Viresh Kumar Bhawra : ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం.. పంజాబ్ డీజీపీపై వేటు

ప్రధానికి రక్షణ చేపట్టడంలో విఫలమైన పంజాబ్ డీజీపీ సిద్ధార్థ్ చటోపాధ్యాయపై వేటు పడింది. ఆయన స్థానంలో కొత్త డీజీపీగా వీరేష్ కుమార్ భవ్రా నియమితులయ్యారు.

Viresh Kumar Bhawra : ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం.. పంజాబ్ డీజీపీపై వేటు

Viresh Kumar Bhawra

Updated On : January 9, 2022 / 8:54 AM IST

Viresh Kumar Bhawra : ప్రధాని మోదీకి రక్షణ కల్పించడంలో విఫలమైన పంజాబ్ డీజీపీ సిద్ధార్థ్ చటోపాధ్యాయపై వేటు పడింది. ఆయన స్థానంలో కొత్త డీజీపీగా వీరేష్ కుమార్ భవ్రా నియమితులయ్యారు. కాగా, పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించడానికి కొన్ని గంటల ముందే.. కొత్త డీజీపీని నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

WhatsApp Update : వాట్సాప్ ఫ్యూచర్ అప్‌డేట్.. చాట్ లిస్టులో ఈ రెండు ఆప్షన్లు ఎత్తేస్తోంది..!

వీరేష్‌ కుమార్ భవ్రా.. 1987 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ ఆఫీసర్‌. పంజాబ్‌ డీజీపీగా రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పంపిన ప్యానల్‌లో.. దినకర్‌ గుప్తా, వీరేష్‌ కుమార్‌ భవ్రా, ప్రబోద్ కుమార్‌ల పేర్లను ప్రతిపాదించగా.. వీకే భవ్రాను కొత్త డీజీపీగా నియమించింది ప్రభుత్వం. కాగా, చన్నీ ప్రభుత్వంలో.. మూడో డీజీపీగా వీరేష్‌ కుమార్‌ భవ్రా బాధ్యతలు తీసుకోనున్నారు.

ఇటీవల(జనవరి 5) ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనకు వెళ్లారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ప‌ర్య‌టించాల్సి ఉంది. అయితే భద్రతా లోపాల కారణంగా ప్రధాని కాన్వాయ్ దాదాపు 20 నిమిషాల పాటు ఓ ఫ్లైఓవర్ పై నిలిచిపోయింది. ప్రధాని మోదీ ఫ్లైఓవర్ పైనే చిక్కుకుపోవడం కలకలం రేపింది. ఈ ఘటనతో ప్రధాని మోదీ తన పర్యటను రద్దు చేసుకుని తిరిగి వెళ్లిపోయారు. ప్రధాని కాన్వాయ్ ని అడ్డుకున్న ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. భద్రతా వైఫల్యానికి సంబంధించి పంజాబ్ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పంజాబ్ డీజీపీ.. భద్రతా ఉల్లంఘనలకు పాల్పడ్డారని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కుట్ర పూరితంగానే ప్రధాని పర్యటనను అడ్డుకున్నారని బీజేపీ ఆరోపించింది. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి కోవింద్ సైతం ఈ అంశంపై పంజాబ్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

iPhone 12 Series : ఆపిల్ ఐఫోన్లపై భారీ తగ్గింపు.. రూ.10వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్..!

పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ ఈ ఘటనపై స్పందిస్తూ… జరిగిన దానికి విచారం వ్యక్తం చేశారు. మోదీ పర్యటనలో ఎలాంటి భద్రతా వైఫల్యాలూ లేవని స్పష్టంచేశారు. చివరి నిమిషంలో రోడ్డు మార్గంలో ప్రయాణించాలని నిర్ణయించడం వల్లే ఈ విధంగా జరిగిందన్నారు. పంజాబ్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందనడం సరికాదన్నారు. మోదీపై దాడి చేసే పరిస్థితులు అక్కడ చోటు చేసుకోలేదని చెప్పారు. ప్రధాని భద్రతా ఏర్పాట్లన్నీ కేంద్ర ఏజెన్సీల చేతుల్లోనే ఉంటాయని.. ఆయన భద్రత విషయంలో పంజాబ్ పోలీసుల పాత్ర చాలా తక్కువని వివరించారు.