రిపబ్లిక్, టైమ్స్ నౌ చానళ్లపై కోర్టుకెక్కిన బాలీవుడ్

  • Published By: venkaiahnaidu ,Published On : October 12, 2020 / 09:49 PM IST
రిపబ్లిక్, టైమ్స్ నౌ చానళ్లపై కోర్టుకెక్కిన బాలీవుడ్

Updated On : October 12, 2020 / 9:54 PM IST

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ వివాదాలకు బాగా కేంద్రబిందువుగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి,ఆ తర్వాత డ్రగ్స్ కేసుతో కూడా బాలీవుడ్ ప్రముఖులు మరోసారి సెంటర్ అయిపోయారు. డ్రగ్స్ వినియోగంలో బాలీవుడ్ ప్రముఖులు చాలా మంది ఉన్నారని అనేక ఆరోపణలు వచ్చాయి.


ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో బాలీవుడ్ ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ న్యూస్ చానల్స్‌పై ఢిల్లీ హైకోర్టులో బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు సివిల్ సూట్ దాఖలు చేశారు. బాలీవుడ్ గురించి రిపబ్లిక్ టీవీ, టైమ్స్‌ నౌ అవమానకర స్థాయిలో వ్యాఖ్యలు చేశారని, ‘మురికి, మలినం, డ్రగ్గీస్, దుమ్ము’ అంటూ తమను అవమానించారని బాలీవుడ్ ప్రముఖులు వాపోయారు.



బాలీవుడ్‌లోని నాలుగు అసోషియేషన్స్‌, 34 బడా నిర్మాణ సంస్థలు కలిసి సివిల్ సూట్ దాఖలు చేశారు. షారుక్ ఖాన్ రెడ్ ఛిల్లీస్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, అజయ్ దేవ్‌గన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్ నిర్మాణ సంస్థలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. రిపబ్లిక్ టీవీకి చెందిన అర్నాబ్ గోస్వామి, ప్రదీప్ భండారీ.. టైమ్స్‌ నౌ‌కు చెందిన నవీకా కుమార్, రాహుల్ శివకుమార్‌లపై ఈ సూట్ దాఖలు చేశారు.