శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు డేట్ ఫిక్స్.. కొత్త తేదీని వెల్లడించిన ఇస్రో..
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు కొత్త తేదీ ఫిక్స్ అయింది. ఈ మేరకు ఇస్రో ప్రకటించింది.

Subhanshu Shukla
Shubhanshu Shukla: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు కొత్త తేదీ ఫిక్స్ అయింది. జూన్ 19న శుభాంశు శుక్లా యాక్సియం-4 మిషన్ లో భాగంగా అంతరిక్ష యాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు ఇస్రో కొత్త తేదీని వెల్లడించింది. అయితే, తొలుత మే 29న ప్రయోగం జరగాల్సి ఉండగా.. సాంకేతిక కారణాలతో పలుమార్లు ప్రయోగం వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే.
శుభాంశు మిషన్ పైలట్‌గా..
అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ నిర్వహిస్తోంది. ఇస్రో, నాసా, ఐరాపో అంతరిక్ష సంస్థలు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ స్పేస్ క్యాప్సూల్ ను ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి మోసుకెళ్తుంది. ఇందులో శుభాంశు మిషన్ పైలట్ బాధ్యతలు నిర్వహిస్తారు. అతనితోపాటు మరో ముగ్గురు ఆస్ట్రానాట్లు అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు. వీరిలో మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, స్పెషలిస్టులు టిబర్ కపు (హంగరీ), స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ- విస్నియెస్కీ (పోలండ్)లు ఉన్నారు.
ఇప్పటికే పలుసార్లు వాయిదా.. ఈసారైనా..!
యాక్సియం-4 మిషన్ కోసం శుభాంశు బృందం మే 29వ తేదీన నింగిలోకి పయనం కావాల్సి ఉంది. అయితే, దాన్ని తొలుత జూన్ 8వ తేదీకి వాయిదా వేశారు. ఆ తరువాత 10వ తేదీకి మార్చారు. ఆ రోజు ప్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్ ఉన్న ప్రాంతంలో ప్రతికూల వాతావరణం కారణంగా దానిని మరుసటి రోజు అంటే.. ఈనెల 11న (బుధవారం)కు వాయిదా వేశారు. ఈనెల 11న నింగిలోకి వెళ్లాల్సిన ఫాల్కన్-9 రాకెట్ లో ద్రవ ఆక్సిజన్ లీకవుతున్న కారణంగా ప్రయోగం మళ్లీ వాయిదా పడినట్లు స్పేస్‌ఎక్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. ప్రయోగానికి ముందు బూస్టర్ దశ పనితీరును పరిశీలిస్తుండగా లీకేజీని గుర్తించినట్లు తెలిపింది. మరమ్మతులకు సమయం పడుతుందని, త్వరలోనే కొత్త తేదీని వెల్లడిస్తామని స్పేస్ ఎక్స్ ప్రకటించింది.
అయితే, తాజాగా.. శుభాంశు బృందం అంతరిక్ష యాత్రకు సంబంధించి ఇస్రో కొత్త తేదీని ప్రకటించింది. జూన్ 19న శుభాంశు బృందం అంతరిక్ష యాత్రకు బయలుదేరనుంది.
ఈ ప్రయోగంలో భాగంగా భూమి నుంచి బయల్దేరిన 28గంటల తరువాత ఈ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం అవుతుంది. శుభాంశు బృందం 14రోజుల పాటు అక్కడే బస చేస్తుంది. ఈ క్రమంలో భారరహిత స్థితిలో అనేక ప్రయోగాలు నిర్వహిస్తుంది.