ఇస్రో భవిష్యత్ ప్రణాళికలు మూములుగా లేవు.. ఏం చేయబోతుందో చెప్పేసిన ఇస్రో ఛైర్మన్

ప్రస్తుతం కక్ష్యలో ఉన్న భారత ఉపగ్రహాల సంఖ్య 55 అని, అయితే ఇది సరిపోదని, రాబోయే మూడేళ్లలో ఈ సంఖ్య కనీసం 150కి పెరగాలని ఇస్రో ఛైర్మన్ స్పష్టం చేశారు.

ఇస్రో భవిష్యత్ ప్రణాళికలు మూములుగా లేవు.. ఏం చేయబోతుందో చెప్పేసిన ఇస్రో ఛైర్మన్

ISRO chief V Narayanan

Updated On : July 25, 2025 / 10:20 PM IST

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) దూకుడుగా ముందుకు సాగుతోంది. సర్వీస్ బేస్డ్‌ పనులతో పాటు, వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుంటూ, సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణ లక్ష్యంతో దూసుకుపోతోంది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ వి.నారాయణన్ శుక్రవారం దీనిపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారతీయ అంతరిక్ష సంస్థ కేవలం సేవలను అందించడమే కాకుండా, వ్యాపార అవకాశాలను వినియోగించుకోవడానికి, తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకోవడానికి లక్ష్యాలను నిర్దేశించుకుందని వెల్లడించారు. అంతరిక్ష రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

సొంత అంతరిక్ష కేంద్రం, ఉపగ్రహాల సంఖ్య పెంపు
“2035 నాటికి భారతదేశం తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేసుకుంది. తొలి మాడ్యూల్‌ను 2028 నాటికి కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని నారాయణన్ తెలిపారు.

ప్రస్తుతం కక్ష్యలో ఉన్న భారత ఉపగ్రహాల సంఖ్య 55 అని, అయితే ఇది సరిపోదని, రాబోయే మూడేళ్లలో ఈ సంఖ్య కనీసం 150కి పెరగాలని ఇస్రో ఛైర్మన్ స్పష్టం చేశారు. “ఈ వేగంతో, 2040 నాటికి అంతరిక్ష సాంకేతికత, వినియోగ రంగాలు, మౌలిక సదుపాయాల పరంగా భారతదేశం ఏ దేశానికైనా గట్టి పోటీనివ్వగలదు” అని నారాయణన్ అభిప్రాయపడ్డారు. గత పదేళ్లలో ఇస్రో మొత్తం 518 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది.

ఇస్రో ప్రణాళికలు, మిషన్లు
“ప్రస్తుతం మేము మా సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడంపై దృష్టి పెట్టాం. త్వరలో మరో చంద్రయాన్ ల్యాండింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు 55 ఉపగ్రహాలు భారతీయులకు సేవలందిస్తున్నాయి. కానీ డిమాండ్ చాలా ఉంది. అందుకే పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలను రూపొందించాల్సిన అవసరం ఉందని గుర్తించి, ఆ దిశగా ముందుకు వెళ్తున్నాం” అని నారాయణన్ అన్నారు.

ఈ ఏడాది మొత్తం 12 ప్రయోగ వాహన మిషన్లను చేపట్టబోతున్నట్టు తెలిపారు.

  • NASA-ISRO NISAR మిషన్: జూలై 30న GSLV F16 ద్వారా NASA-ISRO సంయుక్త NISAR మిషన్ ను ప్రయోగించనున్నారు.
  • అమెరికా కోసం కమ్యూనికేషన్ ఉపగ్రహం: మరో మూడు నెలల్లో, అమెరికా కోసం 6,500 కిలోల కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భారతీయ లాంచ్ వెహికల్ ద్వారా ప్రయోగించనున్నారు.
  • శ్రీహరికోటలో మూడవ ప్రయోగ వేదిక (Launch Pad) ఏర్పాటుకు ప్రభుత్వం రూ.4,000 కోట్లు కేటాయించి, అనుమతి ఇచ్చింది.

గగనయాన్ మిషన్, అంతర్జాతీయ సహకారం
భారతీయులను అంతరిక్షంలోకి పంపే గగనయాన్ మిషన్‌ను 2027 మొదటి త్రైమాసికంలో ప్రయోగించాలన్నది ఇస్రో లక్ష్యం  చంద్రయాన్-3 విజయం అంతర్జాతీయంగా ఆసక్తిని పెంచింది. జపాన్ కూడా భారత్‌తో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపింది.

ఇస్రో-జాక్సా (JAXA) సంయుక్తంగా చంద్రయాన్-5 / LUPEX మిషన్ పై పనిచేస్తున్నాయి. “మేము ఉపగ్రహాన్ని కలిసి నిర్మిస్తున్నాం, లాంచ్ మాత్రం జపాన్ చేస్తుంది. చంద్రయాన్-3 ల్యాండర్ బరువు 1,600 కిలోలైతే, ఈ సారి అది 6,600 కిలోలు ఉంటుంది. రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ మిషన్ గురించి గొప్ప విషయాలు తెలుస్తాయి” అని నారాయణన్ తెలిపారు.