PSLV-C58: కొత్త సంవత్సరంలో మరింత ఉత్సాహంగా.. మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. కౌంట్‌డౌన్ షురూ
ఇస్రో నూతన సంవత్సరం ప్రారంభం రోజు నింగిలోకి ప్రయోగిస్తున్న పీఎస్ఎల్వీ -సీ58 ప్రయోగం కౌంట్ డౌన్ ప్రారంభమైంది.

PSLV-C58
ISRO : శాస్త్రసాంకేతిక రంగాల్లో ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్న భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) 2023లో కీలక మైలురాళ్లను అధిగమించింది. విజయవంతమైన ప్రాజెక్టులతో ప్రపంచ యవనికపై భారత విజయపతాకాన్ని రెపరెపలాడించింది. అదే స్ఫూర్తితో కొత్త సంవత్సరంలో మరిన్ని మిషన్స్ చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో 2024 జనవరి 1వ తేదీన (సోమవారం) పీఎస్ఎల్వీ-సీ58 ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో సిద్ధమైంది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ (శ్రీహరి కోట)లో శనివారం రాకెంట్ సన్నద్ధత (ఎంఆర్ఆర్), లాంచ్ ఆథరైజేషన్ సమావేశాలు జరిగాయి. ఇందులో రాకెట్ అనుసంధానం, ఉపగ్రహ అమరిక, పరీక్షలు తదితరాలపై సుదీర్ఘంగా చర్చించారు.
Also Read : ISRO: 50 శాటిలైట్లను ప్రయోగిస్తాం: ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్
ఇస్రో నూతన సంవత్సరం ప్రారంభం రోజు నింగిలోకి ప్రయోగిస్తున్న పీఎస్ఎల్వీ -సీ58 ప్రయోగం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 8.10 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభించారు. 25 గంటలపాటు కొనసాగిన తరువాత సోమవారం ఉదయం 9.10 గంటలకు పీఎస్ఎల్వీ -సీ58 వాహకనౌక షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్ లో ఈ ప్రయోగం 60వది కావటం విశేషం. అయితే, ప్రస్తుతం నింగిలోకి దూసుకెళ్తున్న పీఎస్ఎల్వీ – సీ58 ప్రయోగం ఉప్రగహ జీవితకాలం అయిదేళ్లు.
పీఎస్ఎల్వీ వాహకనౌక మనదేశానికి చెందిన ఎక్స్ -రే పొలారిమీటర్ ఉపగ్రహం (ఎక్స్ పోశాట్) ను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. ఎక్స్ పోశాట్ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్ -రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాందికానుంది. ఇమేజింగ్, టైం డొమైన్ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కోపీపై ప్రధానంగా దృష్టి సారించిన మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా, ఎక్స్ -రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ, ఎక్స్ -రే మూలాలను అన్వేషించడం ఎక్స్ పోశాట్ లక్ష్యం.
Also Read : ISRO Chandrayaan-3 : అరుదైన ఘనత సాధించిన ఇస్రో.. భూ కక్ష్యకు ప్రొపల్షన్ మాడ్యూల్ మళ్లింపు
పీఎస్ఎల్వీ సీ58 రాకెట్ 44.4 మీటర్లు పొడవు కలిగి ప్రయోగ సమయంలో 260 టన్నుల బరువు ఉంటుంది. ఈ ప్రయోగాన్ని నాలుగు దశల్లో 21.55 నిమిషాల్లో పూర్తిచేయనున్నారు. రాకెట్ మొదటి దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 24.4 టన్నుల ఘన ఇంధనం, కోర్ అలోన్ దశలో నింపిన 138 టన్నుల ఘన ఇంధనంతో 109.40 సెకెండ్లను పూర్తి చేస్తారు. రాకెట్ దూసుకెళ్తున్న తరుణంలోనే 175 సెకెండ్లకు శాటిలైట్ కు రక్షణ కవచంగా ఉన్న హీట్ షీల్డ్ విడిపోతుంది. అనంతరం 41.9 టన్నుల ద్రవ ఇంధనంతో 261.50 సెకెండ్లకు రెండో దశ, 7.66 టన్నుల ఘన ఇంధనంతో 586.26 సెకెండ్లకు మూడో దశ, 1.6టన్నుల ద్రవ ఇంధనంతో 1258.92 సెకెండ్లకు నాలుగో దశ పూర్తి చేస్తారు.
నాల్గో దశలో ద్రవ ఇంధన మోార్ 1315.92 సెకెండ్లకు (21.55 నిమిషాల్లో) ఎక్స్ ఫోశాట్ అనే ఉప్రగహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టి ప్రయోగాన్ని పూర్తి చేస్తారు.