Jammu Kashmir Election 2024: జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న రెండో విడత పోలింగ్.. మీకు ఈ విషయాలు తెలుసా?

బుధవారం ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ..

Jammu Kashmir Election 2024: జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న రెండో విడత పోలింగ్.. మీకు ఈ విషయాలు తెలుసా?

Jammu kashmir election 2024

Updated On : September 25, 2024 / 7:51 AM IST

Jammu kashmir election 2024 : జమ్మూకశ్మీర్‌లో రెండో విడత పోలింగ్ కొనసాగుతుంది. పీర్ పంజాల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బడ్ గామ్, రాజౌరీ, పూంఛ్, గండేర్ బల్, రియాసీ జిల్లాల్లోని 26 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 239 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, బీజేపీ జమ్మూ కశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా సహా పలువురు కీలక నేతలు పోటీలో ఉన్నారు.

 

బుధవారం ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పలువురు రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3,500 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 13వేల మందికిపైగా పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో పోలీసులు, సాయుధ పోలీసు బలగాలు, కేంద్ర సాయుధ పారామిలటరీ బలగాలను మోహరించారు. రెండో విడత పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

 

  • రెండో దశ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమైన విషయాలు..
  • ఆరు జిల్లాల్లోని 26 నియోజకవర్గాల్లో పోలింగ్. ఇందులో జమ్మూలో 11 సీట్లు, కాశ్మీర్ లో 15 సీట్లు ఉన్నాయి.239 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
  • గందర్‌బల్ (కశ్మీర్ ప్రాంతం)లో రెండు స్థానాలకు 21మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
  • శ్రీనగర్ (కశ్మీర్ ప్రాంతం)లో ఐదు స్థానాలకు 93 మంది అభ్యర్థులు.
  • బుద్గాం (కశ్మీర్ ప్రాంతం)లో ఐదు స్థానాలకు 46 మంది అభ్యర్థులు.
  • రియాసీ (జమ్మూ ప్రాంతం)లో ఐదు స్థానాలకు 20 మంది అభ్యర్థులు.
  • రాజౌరి (జమ్మూ ప్రాంతం)లో ఐదు స్థానాలకు 34 మంది అభ్యర్థులు.
  • పుంచ్ (జమ్మూ ప్రాంతం)లో మూడు స్థానాలకు 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
  • 26 స్థానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య 239 కాగా.. వారిలో పురుషులు 233 మంది,మహిళా అభ్యర్థులు ఆరుగురు మాత్రమే.
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న 25.78లక్షల మంది ఓటర్లు.
  • ఏ పార్టీ నుంచి ఎంత మంది అంటే.. జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (26), జమ్మూ మరియు కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (20), బీజేపీ (17), జమ్మూ అండ్ కాశ్మీర్ అప్నీ పార్టీ (16), కాంగ్రెస్ (6), ఎస్పీ (5), ఎన్సీపీ (4), ఇండిపెండెంట్ 99 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

జమ్మూకాశ్మీర్ లో పదేళ్ల తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మొదటి విడత పోలింగ్ 24అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబర్ 18న పూర్తయింది. 61.38శాతం మంది ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. రెండో దశలో 26 స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతుంది. మూడో దశలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 1న పోలింగ్ జరగనుంది.