అన్ని రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యం : బీజేపీ 100 డేస్ ప్లాన్, నడ్డా దేశవ్యాప్త యాత్ర

JP Nadda is set to tour the country : అన్ని రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దేశవ్యాప్త యాత్రకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రీయ విస్తృత్ ప్రవాస్ పేరుతో 100 రోజుల పాటు యాత్రను చేపట్టాలని నిర్ణయించారు. ఏయే రాష్ట్రంలో ఎన్ని
రోజులు పర్యటించాలన్నది కూడా ఖరారైనట్లుగా తెలుస్తోంది.
ముఖ్యంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పరాభవం పొందిన రాష్ట్రాలు, నియోజకవర్గాలపై ఈ యాత్ర ద్వారా ఎక్కువ ఫోకస్ పెట్టనున్నారు. యాత్రలో భాగంగా నడ్డా.. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. పార్టీ పటిష్ఠత, విస్తరణపై బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. పార్టీ విస్తరణకు చేస్తున్న, చేసిన కార్యక్రమాలను ఆయా రాష్ట్రాల నేతలు నడ్డా ముందు ఉంచనున్నారు. వీటన్నింటినీ ఆధారంగా.. ఇకపై పార్టీ విస్తరణ ఎలా చేయాలన్న దానిపై నడ్డా మార్గనిర్దేశం చేస్తారని తెలుస్తోంది.
నడ్డా యాత్రను దృష్టిలో పెట్టుకుని అధిష్ఠానం పలు కీలక ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రాలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించింది. గ్రూపు ఏలో బీజేపీ పాలిత రాష్ట్రాలు, బీ గ్రూపులో అధికారంలో లేని రాష్ట్రాలు, సీ గ్రూపులో చిన్న రాష్ట్రాలు, చివరగా డీ గ్రూపులో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా గ్రూపులుగా విభజించుకొని మరీ.. పకడ్బందీ ప్రణాళికను రూపొందించింది బీజేపీ.