ఎంపీలో ఆపరేషన్ లోటస్ : అర్థరాత్రి చౌహాన్‌తో సింధియా సమావేశం

మధ్యప్రదేశాలో బీజేపీ ఆపరేషన్ లోటస్ ప్రారంభినట్లు తెలుస్తోంది. కర్నాటక తరహాలోనే మధ్యప్రదేశ్లో కూడా త్వరలో బీజేపీ ఆపరేషన్ లోటస్ ప్రారంభిస్తుందని ఇటీవల కర్ణాటక కాంగ్రెస్ నాయకులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు మరింత బలం చేకూర్చేలా సోమవారం అర్థరాత్రి భోపాల్లో మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జ్యోతిరాధిత్య సింధియా, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్లు సమావేశమవడం ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో సింధియా సీఎం పదవి ఆశించారు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం కమల్ నాథ్ వైపే మొగ్గుచూపింది. అయితే మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ దావోస్ పర్యటనలో ఉన్న సమయంలో చౌహాన్, సింధియాల భేటీ ఆశక్తికరంగా మారింది.
40 నిమిషాల పాటు ఇరువురు నేతలు రహస్యంగా చర్చలు జరపడం రాజకీయ వర్గాల్లో హీట్ పుట్టిస్తోంది. సాధారణంగా రాష్ట్ర రాజధానికి దూరంగా ఉండే సింధియా తన అనుచరుల కుటుంబసభ్యులు ఇద్దరు చనిపోవడంతో సోమవారం భోపాల్‌కు వచ్చారు. అక్కడి నుంచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ నేరుగా చౌహాన్ ఇంటికి వెళ్లారు. 40 నిమిషాల పాటు ఏకాంతంగా ఇద్దరూ చర్చించుకొన్న తర్వాత కారు దగ్గరకు సింధియాను చౌహాన్ సాగనంపడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే మర్యాదపూర్వకంగానే తాము ఇద్దరం కలుసుకున్నామని ఇద్దరు నేతలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం అందరినీ కలుపుకుపోతామని సింధియా తెలిపారు.
చౌహాన్-సింధియా సమావేశంపై బీజేపీ, కాంగ్రెస్‌లు భిన్నంగా స్పందించాయి. అభివృద్ధి పనులకు చౌహాన్ సహకారం కోసమే ఆయనతో సింధియా భేటీ అయ్యారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనాక్ అగర్వాల్ తెలిపారు. సింధియా చౌహాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసినా కాంగ్రెస్ ఉలిక్కిపడుతోందని బీజేపీ అధికార ప్రతినిధి రజనీష్ అగర్వాల్ అన్నారు.