మండి లోక్‌సభ స్థానం నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నామినేషన్

బాలీవుడ్ నటి, బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్.. లోక్‌సభ ఎన్నికలకు హిమాచల్ ప్రదేశ్ లోని మండి స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు.

మండి లోక్‌సభ స్థానం నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నామినేషన్

Kangana Ranaut Nomination: బాలీవుడ్ నటి, బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ మంగళవారం లోక్‌సభ ఎన్నికలకు హిమాచల్ ప్రదేశ్ లోని మండి స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. కంగనాతో పాటు ఆమె తల్లి ఆశా రనౌత్, సోదరి రంగోలి చందేల్ ఉన్నారు. కంగనా ఆకుపచ్చ చీర కట్టుకుని, తలకు హిమాచలీ క్యాప్‌ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆమె ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. “మండి లోక్‌సభ స్థానానికి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశాను. ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం నాకు లభించడం గర్వించదగ్గ విషయం. బాలీవుడ్‌లో నేను విజయం సాధించాను. రాజకీయ రంగంలోనూ నేను విజయం సాధిస్తానని ఆశిస్తున్నాన”ని అన్నారు.

తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఘనత మండి ప్రజలకు దక్కుతుందని కంగన అన్నారు. ”నాపై మండి ప్రజలకు ఉన్న ప్రేమ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. మన దేశంలో మహిళలు అన్ని రంగాల్లోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. అయితే కొన్నేళ్ల క్రితం మండిలో భ్రూణహత్యలు ఎక్కువగా జరిగేవి. కానీ ఈరోజు మండి మహిళలు విద్య, రాజకీయ రంగాలతో పాటు సైన్యంలోనూ ఉన్నార”ని వెల్లడించారు.

Also Read: రామ్‌దేవ్‌ బాబాకు చాలా పలుకుబడి ఉంది.. దాన్ని సరిగ్గా వాడుకోవాలి: సుప్రీంకోర్టు

నా కూతురు గెలుస్తుంది: కంగన తల్లి
కంగన తప్పకుండా విజయం సాధిస్తుందని ఆమె తల్లి ఆశా రనౌత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల కోసం తన కూతురు ఎంతో చేసిందని, భవిష్యత్తులో కూడా చేస్తుందని అన్నారు. కంగన “కొత్త ప్రయాణం”పై ఆమె రంగోలి చందేల్ శుభాకాంక్షలు తెలియజేసింది. కాగా, హిమాచల్‌లో జూన్ 1న పోలింగ్ జరగనుంది. మండి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ పోటీలో ఉన్నారు.