ముంబైని POKతో పోల్చిన హీరోయిన్ కంగనా రనౌత్‌కు Yప్లస్ సెక్యూరిటీ

ముంబై నగరాన్ని పీవోకేతో పోల్చిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు కేంద్రం Y ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఓ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌తో పాటు 11 మంది పోలీసులు భద్రతగా ఉంటారని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. కంగనాకు కల్పించే భద్రతలో కమాండోలు కూడా ఉండనున్నట్లు కేంద్రం హోంశాఖ వర్గాల ద్వారా వెల్లడైంది.
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా ముంబైలో కంగనాకు భద్రత కల్పించే యోచనలో ఉంది. కంగనాకు భద్రత కల్పించాలని ఆమె సోదరి, తండ్రి తనను కోరినట్లు హిమాచల్ సీఎం జైరాం థాకూర్ తెలిపారు. కంగనా, ముంబై నగరాన్ని పీవోకే పోల్చడం సంచలనం రేపింది. ఈ వ్యవహారంలో ఆమెకు బెదిరింపులు వస్తున్నాయి. దీంతో సెక్యూరిటీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
ముంబైని పీవోకేతో పోల్చిన కంగనా:
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో కంగనా రనౌత్ ముంబై పోలీసుల విచారణ తీరును తప్పుపట్టింది. బాలీవుడ్‌లో కొంతమంది ప్రముఖులపైనా ఘాటు కామెంట్లు చేసింది. ముంబైని పీవోకేతో పోలిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తప్పుపట్టారు. ముంబై, మహారాష్ట్ర పట్ల చేసిన కామెంట్లపై క్షమాపణలు చెప్పాలని సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. ఇద్దరి మధ్య మాటలయుద్ధం నడిచింది. సెప్టెంబర్ 9న ముంబైలో ఓ కార్యక్రమంలో కంగనా పాల్గొనాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో కంగనాకు ప్రత్యేక భద్రత కల్పించనున్నట్లు తెలుస్తోంది.
https://10tv.in/pubg-mobile-among-118-additional-chinese-apps-banned-by-government/
మహిళలపై అఘాయిత్యాలకు కారణమిదే:
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన కంగనా మాత్రం అస్సలు తగ్గడం లేదు. తనపై విమర్శలు చేస్తున్నవారిపై మరోసారి విరుచుకుపడింది. ముఖ్యంగా శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ పురుష అహంకారి అని విమర్శించారు. భారతీయ మహిళలపై ఇన్ని ఘోరాలు, అఘాయిత్యాలు జరగడానికి ఇలాంటి పురుష అహంకారమే కారణం అని కంగనా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆమిర్ ఖాన్, నసీరుద్దీన్ షాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు:
తాను మహారాష్ట్రవాసిని కాదన్న సంజయ్ రౌత్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నానని అన్నారు. గతంలో ముంబై మహా నగరంలో బతకలేకపోతున్నామని చెప్పిన ఆమిర్ ఖాన్, నసీరుద్దీన్ షాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కంగనా ప్రశ్నించారు. ఒక మహిళను అయినందునే శివసేన ఎంపీ రెచ్చిపోతున్నారని ఎద్దేవా చేశారు.
దమ్ముంటే అడ్డుకోండి:
సెప్టెంబర్ 9న ముంబై వస్తున్నానని, దమ్ముంటే తనను అడ్డుకోవాలని విమర్శకులకు సవాల్ విసిరారు కంగనా. ప్రస్తుతం ఆమె సిమ్లాలోని తన సొంతింట్లో ఉన్నారు. కాగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని కంగనా అసహనం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే. మంబై పోలీసులపై నమ్మకం లేకుంటే ఇక్కడకు రావొద్దని సంజయ్ రౌత్ కంగనాకు కౌంటర్ ఇచ్చారు.
ఎంపీ సంజయ్ బహిరంగంగా తనకు వార్నింగ్ ఇస్తున్నారని, ఇప్పడు తనకు ముంబై పాక్ ఆక్రమిత కశ్మీర్‌లా కనిపిస్తోందని కంగనా కామెంట్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. విమర్శలు, ప్రతి విమర్శల నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని కంగనా కోరగా, అందుకు కేంద్ర హోంశాఖ అంగీకారం తెలిపింది.