Siddaramaiah-Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేతలతో సిద్ధరామయ్య భేటీ.. డిమాండ్స్ ఇవే.. కొడుకు కోసమే పట్టు..! ఈ శాఖలపైనే గురి
Siddaramaiah : కర్ణాటక సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, సోనియా, మల్లిఖార్జున ఖర్గేలతో వేరువేరుగా భేటీ అయ్యారు.
Karnataka Cm Siddaramaiah Meets Rahul Gandhi Sonia Gandhi
- రాహుల్, సోనియా, ఖర్గేలతో సిద్ధరామయ్య భేటీ
- తన కొడుకుకు డిప్యూటీ సీఎం, కీలక శాఖలకోసం పట్టు
- తన వర్గీయులకు ప్రాధాన్యం ఇచ్చేలా మంతనాలు
Siddaramaiah – Rahul Gandhi: కర్ణాటక సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య వరుసగా కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అవుతున్నారు. గురువారం లోక్‌భవన్‌లో గవర్నర్ ప్రత్యేక కార్యదర్శికి సిద్ధరామయ్య సీఎం పదవికి తన రాజీనామాను అందజేసిన విషయం తెలిసిందే. అయితే, శుక్రవారం సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్ చాంద్ ఆమోదించారు. సిద్దరామయ్య నేతృత్వంలో ఉన్న మంత్రిమండలిని తక్షణమే రద్దు చేస్తున్నట్లు గవర్నర్ తన నోటిఫికేషన్లో తెలిపారు. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు తాత్కాలిక సీఎంగా సిద్ధరామయ్య కొనసాగాలని గవర్నర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
Also Read – Blue Origins : లాంచ్ ప్యాడ్‌పైనే పేలిన రాకెట్.. వీడియో వైరల్.. జెఫ్ బేజోస్ కంపెనీకి భారీ షాక్..
శుక్రవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న సిద్ధరామయ్య.. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గేలతో వేరువేరుగా భేటీ అయ్యారు. రాహుల్ గాంధీతో భేటీ అయిన ఆయన.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై సమాలోచనలు జరిపారు. అయితే, సిద్ధరామయ్య రాజకీయ భవిష్యత్తుపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో రాహుల్ గాంధీ వద్ద ఆయన పలు డిమాండ్లు ఉంచినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. దాదాపు గంటసేపు రాహుల్, సిద్ధరామయ్య మధ్య భేటీ జరిగింది.
ముఖ్యంగా సిద్ధరామయ్య తన కుమారుడు యతీంద్రకు డిప్యూటీ సీఎం పదవితోపాటు కీలక శాఖలు ఇవ్వాలని పట్టుబట్టినట్లు సమాచారం. అలావీలుకాని పక్షంలో వైద్య, విద్య, వెనుకబడిన తరగతుల వంటి కీలక శాఖల్లో ఏదో ఒకటి కేటాయించాలని కోరినట్లు సమాచారం. లేదంటే గతంలో డీకే శివకుమార్ నిర్వహించిన పరిశ్రమలు, జలవనరుల శాఖ అయినా ఇవ్వాలని కోరినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కుమారుడితోపాటు తన విధేయులకు కేబినెట్లో చోటు కల్పించాలని, ఎమ్మెల్సీ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సిద్ధరామయ్య రాహుల్ గాంధీని కోరినట్లు తెలిసింది.
మరోవైపు..కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి , ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఢిల్లీలో ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అవుతున్నారు. ప్రమాణ స్వీకారం తేదీ, కేబినెట్ కూర్పు తదితర అంశాలపై చర్చలు జరుపుతున్నారు.
