ఆపరేషన్ లోటస్ 2.0 : కాంగ్రెస్-జేడీఎస్ లో అగ్నిపర్వతం బద్దలవబోతుంది

కర్నాటకలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతూనే ఉంది. ఆపరేషన్ లోటస్ 2.0 దెబ్బకు కాంగ్రెస్-జేడీఎస్ పరిస్థితి కకావికలంగా మారింది. సంకీర్ణ ప్రుభుత్వాన్ని పడగొట్టాలన్న ఉద్దేశ్యం తమకు లేదని చెబుతూనే బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే తమ ఎమ్మెల్యేలందరినీ బీజేపీ గురుగావ్ లోని రిసార్టుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో కాంగ్రెస్ తమ ప్రభుత్వాన్ని ఎటువంటి ఢోకా లేదని, తమ సంఖ్యా బలాన్ని నిరూపించుకొనేందుకు శుక్రవారం మాజీ సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన బెంగళూరులో ఏర్పాటుచేసిన సీఎల్పీ మీటింగ్ కు నలుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు రమేష్ జర్కిహోలి, బి.నాగేంద్ర, ఉమేష్ యాదవ్, మహేష్ కుమటహళ్లి గైర్హాజరవడం కాంగ్రెస్ లో కలవరం సృష్టించింది.
దీంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సీఎల్పీ భేటీ అనంతరం తమ ఎమ్మెల్యేలను, ఎంపీలను బిడిదిలోని ఈగల్టన్ రిసార్టుకు కాంగ్రెస్ తరలించింది. బీజేపీ నుంచి తమ ఎమ్మెల్యేలను రక్షించుకొనేందుకు వారిని రిసార్టుకు తరలించినట్లు మాజీ సీఎం సిద్దరామయ్య తెలిపారు. నలుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు శనివారం(జనవరి 19, 2019) బీజేపీలో చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకొన్నారు. వారు బహిరంగంగానే బీజేపీకి మద్దతు ప్రకటించారు.
కాంగ్రెస్-జేడీఎస్ భాగస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అగ్నిపర్వతం ఎదురుచూస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సీఎల్పీ భేటీకి నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరవకపోవడం చూస్తుంటే రాబోయో రోజుల్లో సంకీర్ణ భాగస్వాముల మధ్య ఓ అగ్నిపర్వతం బద్దలయ్యే సూచనలు కన్పిస్తున్నాయని యడ్యూరప్ప తెలిపారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరు వదిలి రిసార్టుకు వెళ్లడంతో కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప గురుగావ్ హోటల్ లో ఉన్న తమ ఎమ్మెల్యేలను కర్ణాటక రావాలని ఆదేశించారు. దీంతో కర్నాటకలో ఏ క్షణమైనా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే అవకాశముందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.