పెళ్లికూతురు చీర బాగాలేదని పారిపోయిన పెళ్లికొడుకు: ‘ఆనంద్’ సినిమా లాంటిదే

కట్నం సరిపోలేదనో..మర్యాదలు బాగా చేయలేదనో నాకీ పెళ్లి వద్దు అనే పెళ్లి కొడుకుల గురించి విని ఉంటాం. కానీ ప్రేమించి పెద్దలను ఒప్పించి..కాసేపట్లో పెళ్లి అనగా..పెళ్లి కూతురు కట్టుకున్న చీర బాగాలేదు నేనీ పెళ్లి చేసుకోను అనేశాడు ఓ పెళ్లి కొడుకు. కర్ణాటక హసన్ తాలుకా పరిధిలోని బీదర్‌కేర్ గ్రామంలో పెళ్లి కూతురు కట్టుకున్న చీర బాగాలేదని పెళ్లికొడుకు వెళ్లిపోయిన ఘటన జరిగింది.
ఏంటీ..శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మంచి కాఫీలాంటి సినిమా..అనే క్యాప్షన్ తో వచ్చిన ‘ఆనంద్’ సినిమా గుర్తుకొస్తోందా? ఆ సినిమాలో తాను తీసుకొచ్చిన పట్టుచీరే కట్టుకోవాలని పెళ్లి కొడుకు తల్లి హుకుం జారీ చేస్తుంది. కానీ పెళ్లికూతురు..(హీరోయిన్ కమలినీ ముఖర్జీ)మాత్రం మా అమ్మ నాకోసం కొన్న చీరనే కట్టుకుంటాను అని తెగేసి
చెప్పటం..దానికి పెళ్లి కొడుకు తల్లి ఒప్పుకోకపోవటం పెళ్లి క్యాన్సిల్ కావటం జరుగుతుంది. ఇంచుమించి ఇటువంటిదే కర్ణాటకలోని బీదర్ కేర్ గ్రామంలో శుక్రవారం (ఫిబ్రవరి 7,2020)జరిగింది.
వివరాల్లోకి వెళితే..బీదర్‌కేర్‌కు చెందిన బీఎన్ రఘుకుమార్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతి సంగీతను ప్రేమించాడు. మేమిద్దరం ఇష్టపడ్డామనీ పెళ్లి చేయమని ఇద్దరూ వారి వారి పెద్దలకు చెప్పారు. ఇరు కుటుంబాల పెద్దలు కూడా వీరిద్దరి పెళ్లి చేయటానికి అంగీకరించారు.
శుక్రవారం ఫిబ్రవరి 6.2020న ముహూర్తం కూడా నిర్ణయించారు. పెళ్లి బట్టలు కొన్నారు. అన్ని పనులు పూర్తయ్యాయి. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. 5వ తేదీ వచ్చింది. మరసటి రోజు అంటే 6న పెళ్లి. ఇంతలో పెళ్లికూతురు ధరించే చీర.. బాగోలేదని..అస్సలు ఏమాత్రం క్వాలిటీ లేదనీ నాసిరకంగా ఉందని పెళ్లికొడుకు రఘుకుమార్ తల్లిదండ్రులు అన్నారు.
ఈ చీర వద్దు..మరో చీర మార్చుకోవాలని (కొనుక్కోవాలని) చెప్పారు. కానీ ఆమె వినలేదు. నాకు ఈ చీరే నచ్చింది. ఇదే కట్టుకుంటాను. అని చెప్పింది. మరోసారి చెప్పారు. కానీ ఆమె విననేలేదు. దీంతో రఘుకుమార్ తల్లిదండ్రులు చీర మార్చుకోకపోతే పెళ్లి జరగదు అని తెగేసి చెప్పేశారు. చీర మార్చుకోమంటే ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నామంటూ పెళ్లికొడుకు..ప్రేమించి పెళ్లి చేసుకోనున్న సంగీతపై అరిచాడు. తరువాత ఎవరికీ తెలియకుండా పారిపోయాడు.
దీంతో పెళ్లికూతురు తల్లిదండ్రులు లబోదిబోమన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని తీరా పెళ్లి జరగబోయే సమయంలో రఘుకుమార్ పరారవ్వటంతో రఘుకుమార్ కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పరువు తీయటానికి ఉద్దేశపూర్వకంగానే ఈ పెళ్లిని రఘుకుమార్ తల్లిదండ్రులు ఆపారని వధువు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
మాకు న్యాయం చేయమని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న పెళ్లికొడుకు రఘుకుమార్ కోసం గాలిస్తున్నామని పోలీస్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ గౌడ తెలిపారు.