ప్రజాస్వామ్యం కరువైందని ఐఏఎస్ రాజీనామా

ప్రజాస్వామ్యం కరువైందని ఐఏఎస్ రాజీనామా

Updated On : September 7, 2019 / 7:57 AM IST

అప్రజాస్వామిక దేశంలో ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగలేనంటూ మరో ఐఏఎస్ తన పదవికి రాజీనామా చేశాడు. కశ్మీర్‌లో జరుగుతున్న ఘటనలపై స్పందించలేకపోతున్నానంటూ కన్నన్ గోపీనాథన్ అనే ఐఏఎస్ అధికారి  పదవికి రాజీనామా చేసిన రెండు వారాల్లో మరో ఘటన చోటు చేసుకుంది. ఐఏఎస్ అధికారి అయిన మరో వ్యక్తి తన పదవికి రాజీనామా చేశాడు. 

2009 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ శశికాంత్ సెంథిల్ దక్షిణ కన్నడ జిల్లాకు డిప్యుటీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. తమిళనాడుకు చెందిన సెంథిల్ భారతదేశ ప్రజాస్వామ్యంపై కొన్ని కీలక కామెంట్లు చేశారు. ఊహించని రీతిలో భిన్న ప్రాథమిక విలువలతో కూడిన ప్రజాస్వామ్య పునాదులు రాజీపడుతుండడంతో ప్రజాసేవకుడిగా ప్రభుత్వంలో కొనసాగడం అనైతికమన్న నిర్ణయానికి వచ్చానని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 

రానున్న రోజుల్లో భారత్‌లో మరిన్ని క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నానని వాపోయాడు. మెరుగైన జీవనాన్ని కల్పించే ప్రయత్నంలో ఐఏఎస్ పదవి నుంచి బయటకు వచ్చి కృషి చేయడమే మంచిదని భావిస్తున్నట్లు తెలిపాడు. ఈ కారణంగానే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు పేర్కొన్నాడు. శుక్రవారం మధ్యాహ్నం శశికాంత్ రాజీనామాపై అధికారులు షాక్ అయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం ఇంకా స్పందించాల్సి ఉంది.