జమ్మూకశ్మీర్ పాకిస్తాన్ మెడలోని నరం : మరోసారి రెచ్చిపోయిన ఇమ్రాన్ ఖాన్

భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడంతో రగిలిపోతున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. భారత్ ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. జమ్మూకశ్మీర్ విషయంలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్ పాకిస్తాన్ దేశానికి చెందిందే అని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. జమ్మూకశ్మీర్ పాక్ మెడలోని నరం వంటిది అని చెప్పారు. పాక్ లో రక్షణశాఖ, అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఇమ్రాన్ సందేశాన్ని విడుదల చేశారు. అందులో జమ్మూకశ్మీర్ గురించి ప్రస్తావించారు. కశ్మీర్ లో ప్రత్యేక ప్రతిపత్తిని ఎత్తివేయడం వల్ల పాకిస్తాన్ దేశ భద్రత, సమగ్రతకు సవాళ్లు ఎదురవుతున్నాయని ఇమ్రాన్ చెప్పారు. కశ్మీర్ పరిస్థితిపై ప్రపంచ దేశాలు సహా ఐక్యరాజ్యసమితికి వివరించేందుకు పాక్ చురుకైన దౌత్య ప్రచారం చేస్తొందని వెల్లడించారు.
అదే సమయంలో భారత్ పై విషం కక్కారు. భారత అణ్వస్త్ర కేంద్రాల భద్రతపై ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా దృష్టి సారించాలని ఇమ్రాన్ కోరారు. లేకుంటే దక్షిణ ఆసియాకే కాకుండా ప్రపంచానికే ముప్పు పొంచి ఉందన్నారు. భారత అణ్వస్త్ర కేంద్రాల భద్రతపై దృష్టి సారించడంలో విఫలమైతే.. తద్వారా తలెత్తే విపత్తుకు ప్రపంచ దేశాలే బాధ్యత వహించాలన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు పాక్ తమ వంతు కర్తవ్యంగా ఎంతో కృషి చేసిందని ఇమ్రాన్ గొప్పలు చెప్పారు. ఇప్పుడు ఆ బాధ్యత ప్రపంచ దేశాలపై ఉందన్నారు. ప్రస్తుతం మా పోరాటం పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక వెనుకబాటుతనంపైనే అని ఇమ్రాన్ చెప్పారు.
ఇమ్రాన్ వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ వేదికపై దోషిగా తేలినా ఇంకా పాక్ ప్రధానికి బుద్ధి రాలేదని మండిపడుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఎంత రెచ్చిపోయినా..భయపడే వారు లేరని చెబుతున్నారు. ఇమ్రాన్ తన తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని భారత్ హెచ్చరించింది.