CAA సెగలు: ఇస్రో బస్సులు కూడా ఆపేశారు

పౌరసత్వ చట్ట సవరణ వ్యతిరేకులు దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలో భాగంగా ఇస్రో బస్సులు కూడా ఆపేశారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)కు విధులపై వెళ్తున్న ఉద్యోగుల బస్సును అడ్డుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ గుర్తింపు ఉండటంతో బస్సును రోడ్డుపై నిలిపేసి అడ్డంగా బైఠాయించారు.
కేరళలోని జిల్లాల్లో పోలీసులు శాంతిభద్రతలు నెలకొల్పేందుకు పలు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కర్ణాటకలోని మంగళూరులో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో సెగలు కేరళకు తాకాయి. కేరళ డీజీపీ డీ లోక్‌నాథ్ బెహరా రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించాల్సిందిగా రాష్ట్ర పోలీసులను కోరారు. వయనాడ్, కొజికొడె, కసరాగడ్, కన్నూరు జిల్లాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
మీడియా కథనం ప్రకారం.. ఆందోళనకారులు రైళ్లు, బస్సులను అడ్డుకున్నారు. డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డీవైఎఫ్ఐ), కేరళ స్టూడెంట్స్ యూనియన్(కేఎస్‌యూ) సభ్యులు పలక్కాడ్, తిరువనంతపురం రైల్వే స్టేషన్లలో ఆందోళనలు సృష్టించారు.
కర్ణాటకలోనూ ఇదే తంతు నడిచింది. కొజికొడెలోని కొన్ని ప్రాంతాల్లో, మంగళూరుకు వెళ్లే బస్సు సర్వీసులు ఆపేశారు. కేరళ రవాణా మంత్రి ఏకే శశీంద్రన్ పరిస్థితులు కుదుటపడ్డాకే సర్వీసులు మళ్లీ మొదలవుతాయని తెలిపారు.