Marriage Bureau Case: 9 ఏళ్లయినా పెళ్లి సెట్ చేయలేదా?.. మ్యారేజ్ బ్యూరోకి జరిమానా.. యువకుడికి పరిహారం
తొమ్మిదేళ్లయినా పెళ్లి (Marriage Bureau Case)సంబంధం చూపించలేదంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై కేరళ వినియోగదారుల ఫోరమ్ కీలక తీర్పునిచ్చింది.
Kerala Consumer Forum delivered a key verdict regarding a person filed case against the Marriage Bureau
- మ్యారేజ్ బ్యూరో నిర్లక్ష్యంపై కేసు
- నర్సింగ్ ప్రొఫెసర్‌కు తీవ్ర అన్యాయం
- పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం
Marriage Bureau Case: ఈమధ్య కాలంలో మ్యారేజ్ బ్యూరోల హవా చాలా పెరిగిపోయింది. పెళ్లి కోసం చాలా మంది మ్యారేజ్ బ్యూరోల చుట్టూ తిరుగుతున్నారు. కానీ, ఆ మ్యారేజ్ బ్యూరోల విషయంలో తాజాగా జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం నేషనల్ వైడ్ వైరల్ గా మారింది. మ్యారేజ్ బ్యూరో నమ్మి రిజిస్ట్రేషన్ చేసుకుంటే, తొమ్మిదేళ్లయినా సరైన పెళ్లి సంబంధం చూపించలేదంటూ ఓ నర్సింగ్ కాలేజీ ప్రొఫెసర్ దాఖలు చేసిన పిటిషన్‌పై కేరళ వినియోగదారుల ఫోరమ్ కీలక తీర్పునిచ్చింది. కస్టమర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైతే మ్యారేజ్ బ్యూరోలు(Marriage Bureau Case) కూడా జవాబుదారీగా ఉండాల్సిందేనని ఈ తీర్పు స్పష్టం చేసింది. ఈ కేసులో సేవల్లో లోపం, అనుచిత వ్యాపార ధోరణి ప్రదర్శించినందుకు గానూ సదరు బ్యూరో బాధితుడికి పరిహారం చెల్లించాలని కన్స్యూమర్ కోర్టు ఆదేశించింది.
బాధితుడి ఆవేదన.. బ్యూరో నిర్లక్ష్యం:
కన్నూర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ప్రెసిడెంట్ రవి సుషా, సభ్యులు మోలికుట్టి మాథ్యూ, సజీష్ కేపీలతో కూడిన బెంచ్ ఈ కేసును విచారించింది. బాధితుడైన నర్సింగ్ ప్రొఫెసర్ 2016లో రూ. 3,000 చెల్లించి ‘శ్రీచక్ర మ్యారేజ్ బ్యూరో’లో రిజిస్టర్ చేసుకున్నారు. త్వరలోనే మంచి సంబంధం చూపిస్తామని బ్యూరో ప్రతి ఏడాది నమ్మిస్తూ వచ్చింది. అయితే, ఈ తొమ్మిదేళ్ల కాలంలో తన వృద్ధాప్య తల్లిదండ్రులు తన పెళ్లి కోసం ఎదురుచూశారని, 2025 అక్టోబర్‌లో క్యాన్సర్‌తో తన తండ్రి మరణించారని ప్రొఫెసర్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యూరో నిర్లక్ష్యం వల్ల తాను తీవ్ర మానసిక క్షోభకు, ఆర్థిక నష్టానికి గురైనట్లు కోర్టును ఆశ్రయించారు.
కోర్టు సంచలన తీర్పు.. జరిమానా విధింపు:
ఈ కేసు విచారణకు శ్రీచక్ర మ్యారేజ్ బ్యూరో ప్రతినిధులు హాజరుకాకపోవడంతో కమిషన్ ‘ఎక్స్-పార్టీ’ ఆర్డర్ జారీ చేసింది. బాధితుడి నుండి తీసుకున్న రూ. 3,000 రిజిస్ట్రేషన్ ఫీజును తిరిగి ఇచ్చేయడంతో పాటు, మానసిక క్షోభకు గురిచేసినందుకు రూ. 3,000 పరిహారం, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ. 2,000 చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లించాలని, లేనిపక్షంలో వార్షికంగా 9 శాతం వడ్డీని కూడా కలుపుకుని కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మ్యారేజ్ బ్యూరోలు ప్రకటనలకు లోబడి సేవలు అందించకపోతే వినియోగదారుల చట్టం ప్రకారం శిక్షార్హులేనని ఈ తీర్పు ద్వారా వెల్లడైంది.
