మరో కరోనా కేసు: ఇండియాలో ఇది మూడవది

  • Published By: vamsi ,Published On : February 3, 2020 / 08:12 AM IST
మరో కరోనా కేసు: ఇండియాలో ఇది మూడవది

Updated On : February 3, 2020 / 8:12 AM IST

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. భారత్‌లో కూడా ఇప్పటికే దీనికి సంబంధించి రెండు కేసులు నమోదు అవగా.. మరో కేసు నమోదైనట్లుగా డాక్టర్ల నుంచి రిపోర్ట్‌లు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే వైద్యులు అప్రమత్తం అయ్యారు. కరోనా వైరస్ మూడవ కేసు కూడా కేరళలో నమోదైంది. భారతదేశంలో కరోనావైరస్ మూడవ కేసు నమోదైనట్లు కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజా ధృవీకరించారు. కేరళలోని కాసర్గోడ్‌లో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు అధికారులు.

ప్రస్తుతం బాధితుడిని ప్రత్యేకంగా ఓ వార్డులో పెట్టి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు అధికారులు. కాగా, కరోనా వైరస్‌ వల్ల ఇప్పటికే చైనాలో 350 మందికి పైగా చనిపోయారు. అలాగే 15 వేల మందికి ఈ వైరస్‌ సోకినట్టుగా నిర్ధారించారు. ఈ ప్రమాదకరమైన వైరస్‌ కారణంగా 25 దేశాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా వైరస్ త్వరగా వ్యాప్తిచెందడంతో భారత్‌ కూడా అప్రమత్తం అయ్యింది. చైనా నుంచి వచ్చే ప్రయాణికులు, ఆ దేశంలోని ఇతర దేశస్తులకు ఈ–వీసా సౌకర్యాన్ని భారత్‌ తాత్కాలికంగా రద్దు చేసింది.

అలాగే ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకున్నట్టు బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇక అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాలు చైనా మీదుగా ప్రయాణించే వారిని కూడా తమ దేశంలోకి రానివ్వట్లేదు. చైనా మరియు ఇతర దేశాలలో ప్రాణాంతకమైన కరోనావైరస్ వ్యాపించగా.. భారతదేశం 650 మందికి పైగా చైనాలోని వుహాన్ నగరం నుంచి ఇండియాకు తరలించింది. చైనాకు చెందిన భారతీయులతో పాటు ఏడుగురు మాల్దీవుల జాతీయులను కూడా భారత్ ఇండియాకు తీసుకుని వచ్చింది.