కేరళ ప్రశాంతం:శబరిమల ఆలయం మూసివేత

  • Published By: chvmurthy ,Published On : January 21, 2019 / 02:26 AM IST
కేరళ ప్రశాంతం:శబరిమల ఆలయం మూసివేత

తిరువనంతపురం : కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ఆదివారం మూసివేశారు. మకరవిళక్కు  వార్షిక పూజల కోసం తెరిచిన ఆలయాన్ని 67 రోజుల తర్వాత   ఆదివారం మూసివేశారు. ఆలయం మూసే ముందు పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పందళరాజ వంశస్ధుడు రాఘవవర్మరాజా స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆలయ గర్భగుడిని మూసివేశారు. 
అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలు వెళ్లవచ్చని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన దరిమిలా రాష్ట్రంలోని ఎల్డీఎఫ్, బీజేపీల మధ్య ఆరోపణలు మొదలయ్యాయి. రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్వామి దర్శనానికి వెళ్తున్న మహిళలను అయ్యప్ప భక్తులు అడ్డగించారు. అయ్యప్ప భక్తులు ఒకవైపు, ప్రభుత్వ మద్దతుతో స్వచ్చంద సంస్ధలు మరోవైపు పోటా పోటీగా ప్రదర్శనలు నిర్విహంచాయి. శబరిమల పరిసరాల్లో నిషేధాజ్ఞలు ఎత్తివేయాలని గత 49 రోజులుగా బీజేపీ చేపట్టిన రిలే నిరాహారదీక్షలు కూడా నిన్న ముగిసాయి. ఆలయాన్ని తిరిగి కుంభ మాసమైన ఫిబ్రవరి 13న తెరుస్తారు.