కృష్ణమ్మ పరవళ్లు…నిండుకుండలా జలాశయాలు

  • Published By: murthy ,Published On : August 7, 2020 / 08:14 AM IST
కృష్ణమ్మ పరవళ్లు…నిండుకుండలా జలాశయాలు

Updated On : August 7, 2020 / 9:50 AM IST

ఎగువున కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండు కుండల్లా మారుతున్నాయి. నదులు ఉరకలెత్తి పరిగెడుతున్నాయి. ఉగ్రరూపం దాలుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలుతో గురువారం సాయంత్రానికి అల్మట్టికి వరదనీరు పోటెత్తింది.



అల్మట్టి కి చేరుతున్న వరదనీరు
మహారాష్ట్ర, మహబలేశ్వరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా లక్షలాది క్యూసెక్కుల్లో వరద నీరు అల్మట్టికి వచ్చి చేరుతుందని కేంద్ర జలసంఘం రెండురోజుల ముందుగానే హెచ్చరించింది.
కేంద్ర జలసంఘం చెప్పినట్లుగానే గురువారం నుంచి అల్మట్టిలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. కర్ణాటక అధికారులు అప్రమత్తమై వచ్చిన వరదనీటిని కిందకు వదులుతున్నారు.



నారాయణపూర్ జలాశయం
దీంతో నారాయణపూర్ జలాశయం వద్ద క్రమంగా ఇన్ ఫ్లో పెరుగుతోంది. అక్కడ కూడా అధికారులు నీటిని నిల్వ చేయకుండా దిగువకు పంపుతున్నారు. జలాశయానికి ఇన్ ఫ్లో 1.50 లక్షల క్యూసెక్కులు వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి జూరాలకు ఇన్ ఫ్లో పెరిగే అవకాశం ఉంది. ఇక్కడకు వచ్చిన వరద నీటిని దిగువకు వదిలేందుకు సిధ్దమయ్యారు.



నారాయణపూర్ జలాశయం వద్ద గురువారం రాత్రి 9 గంటలకి అవుట్‌ఫ్లో 78,900 క్యూసెక్కులుగా ఉండటంతో…. శుక్రవారం మధ్యాహ్నానికి ఆ ఉద్ధృతి జూరాల చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. మరో వైపు తుంగభద్ర ప్రాజెక్టుకు సైతం భారీగా వరద వచ్చి చేరుతోంది. గతేడాది ఇదే సమయంలో లక్షల క్యూసెక్కులతో ప్రాజెక్టుల్ని ముంచెత్తిన కృష్ణాజలాలు.. ఈ ఏడాది ముందుగానే ఒక దఫాగా ప్రాజెక్టుల్ని పలకరించి, ఇప్పుడు మరింత ఉద్ధృతితో వస్తున్నాయి.